దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత శాంథోమ్‌ చర్చి కిటకిట..

దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత శాంథోమ్‌ చర్చి కిటకిట..
X

shanthome-church

దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు.. చర్చిల్లో అర్థరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి.. చెన్నైలోని పురాతనమైన చర్చిలలో క్రిస్టియన్‌ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే పేరొందిన శాంథోమ్‌ చర్చి కిటకిటలాడుతోంది. చిన్నపిల్లలతో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు జరుపుకుంటున్నారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. చర్చిల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. క్రిస్‌మస్‌ సందర్భంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అర్థరాత్రి ముందు నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు జన్మించిన తర్వాత అర్థరాత్రి ప్రార్థనల కోసం క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. బెంగళూరులోని సెయింట్ జేవియర్ కథెడ్రల్ చర్చిలో మతాధికారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కళాకారులు క్రీస్తును కీర్తిస్తూ పాటలు పాడారు.

ఏసుక్రీస్తు జన్మించిన రోజు క్రిస్‌మస్‌. బైబిల్‌ కొత్త నిబంధనలోని సంప్రదాయిక క్రిస్మస్ కథనం ప్రకారం, రక్షకుని గురించిన జోస్యాలను అనుసరించి జోసెఫ్, మేరీ బెత్లెహాం వచ్చినప్పుడు వసతి గృహం గదులు లభ్యం కాకపోవడంతో పశువుల పాకలో వారికి ఆశ్రయం దొరికింది. అక్కడే క్రీస్తు జన్మించాడు. దేవదూతలు ఈ విషయాన్ని పశువుల కాపరులకు చెప్పగా, వారు సమాచారం మిగిలినవారికి చెప్పారు. ఇక క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది. ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది. ప్రస్తుతం ఎక్కువ మంది క్రిస్టియన్లు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన క్రిస్‌మస్ నిర్వహించుకుంటున్నారు.

Tags

Next Story