నిర్భంధంలో అమరావతి గ్రామాలు

అమరావతిలో శాంతియుతంగా జరుగుతున్న రైతుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం నేపథ్యంలో.. అడుగడుగునా ఆంక్షలతో రాజధాని గ్రామాల్లో నిర్బంధకాండ కొనసాగుతోంది. తుళ్లూరు, మందడం, వెలగపూడితో పాటు ఇతర గ్రామాల్లో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసనలు, దీక్షలు, ధర్నాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేసిన పోలీసులు.. గ్రామాల్లోకి వచ్చి, పోయేవారిని ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఆ రాజధాని గ్రామాలకు చెందిన వారికి తప్పా.. మిగత వారిని అనుమతించడం లేదు. దీంతో అమరావతి రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమను పోలీసులు ఉగ్రవాదుల్లా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన ఉద్యమాన్ని ఆపలేరంటున్నారు రాజధాని రైతులు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీపై తలపెట్టిన రూట్ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం కేబినెట్ సమావేశం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఇప్పటికే సచివాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న నివాసాలకు నోటీసులు జారీ చేశారు. బయటివాళ్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సచివాలయం మార్గం గుండా భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయం వైపు రాకుండా ముళ్ల కంచెలు, బారికేట్లును సిద్ధం చేశారు. దీంతో అమరావతి మొత్తం నిర్బంధం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
మరోవైపు అమరావతికి వచ్చే టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో పాటు ఎమ్మెల్సీ బుద్దావెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com