అమరావతిలో అడుగడుగునా నిర్భంధం.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం

అమరావతిలో అడుగడుగునా నిర్భంధం.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం
X

far

అమరావతిలో రైతుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 29 గ్రామాలు నిరసనలతో వేడెక్కుతున్నాయి. మందడంలో మహాధర్నా, తుళ్లూరులో వంటా వార్పు, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు రైతులు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న రైతులు.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని తరలిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా రోడ్డెక్కి రాజధాని కోసం నినదిస్తున్నారు.

ఇప్పటి వరకు రాజధాని గ్రామాలకే పరిమితమైన ఆందోళనలు.. ఇప్పుడు పలు జిల్లాలకు వ్యాపించాయి. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు రైతుల ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మందడంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టెంట్‌ వేసుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో రోడ్డుకు అడ్డంగా బైటాయించి రైతులు నిరసనకు దిగారు. సచివాలయం వెళ్లే రోడ్డును పూర్తిగా బ్లాక్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వకపోతే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. టెంట్‌ వేసుకునేందుకు అనుమతి ఇస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు రైతులు. దీంతో పోలీసులు టెంట్‌ వేసుకునేందుకు అనుమతిచ్చారు.

శుక్రవారం సచివాలయంలో కేబినెట్‌ భేటీ నేపథ్యంలో... అడుగడుగునా ఆంక్షలతో రాజధాని గ్రామాల్లో నిర్బంధకాండ కొనసాగుతోంది. మందడం, వెలగపూడితో పాటు ఇతర గ్రామాల్లో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిరసనలు, దీక్షలు, ధర్నాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేసిన పోలీసులు.. గ్రామాల్లోకి వచ్చిపోయేవారిని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రాజధాని గ్రామాలకు చెందిన వారిని తప్పా.. మిగత వారిని అనుమతించడం లేదు. దీంతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను పోలీసులు ఉగ్రవాదుల్లా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన ఉద్యమాన్ని ఆపలేరంటున్నారు రాజధాని రైతులు.

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీపై తలపెట్టిన రూట్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం కేబినెట్‌ సమావేశం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఇప్పటికే సచివాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న రైతుల నివాసాలకు నోటీసులు జారీ చేశారు. బయటివాళ్లు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సచివాలయం మార్గం గుండా భారీగా పోలీసులను మోహరించారు. సచివాలయంవైపు రాకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లను సిద్ధం చేశారు. దీంతో అమరావతి మొత్తం నిర్బంధం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. నిరసనలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Tags

Next Story