రాజధానే ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం

రాజధానే ఎజెండాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో కేబినెట్ భేటీ నిర్వహిస్తే రైతుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో.. కేబినెట్ భేటీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మరోవైపు కేబినెట్ భేటీ సచివాలయలంలో నిర్వహించాలా, సీఎం క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించాలా అన్న అంశంపై సీఎం వద్ద అధికారులు చర్చిస్తున్నారు. కేబినెట్ భేటీలో మూడు రాజధానుల అంశంపై కీలక చర్చ జరగనుంది. జీఎన్‌రావు కమిటీ నివేదికను మంత్రి వర్గం ఆమోదించే అవకాశం ఉంది. రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే దానిపై మంత్రివర్గంలో క్లారిటీ రానుంది. అభివృద్ధి రిటర్నబుల్ ప్లాట్ల అంశంతో పాటు సీఆర్‌డీఏపైనా కేబినెట్‌లో చర్చించనున్నారు. రాజధాని రైతుల అభిప్రాయసేకరణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన ప్లాట్లకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై సబ్ కమిటీ చర్చించే అవకాశం కనిపిస్తోంది.