భారతదేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు!

భారతదేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు!
X

terror

ఉగ్రవాద సంస్థలు మనదేశాన్ని మరోసారి టార్గెట్ చేశాయి. పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టు గ్రూప్‌లు, ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థలు, మనదేశంలో మారణహోమం సృష్టించడానికి కుట్ర పన్నాయి. అయోధ్య, పంజాబ్‌లలో విధ్వంసం సృష్టించి, రక్తపుటేరులు పారించాలన్నది ఉగ్రవాద సంస్థల కుట్ర. దేశంలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే టెర్రరిస్టుల ప్రణాళిక. ఈ మేరకు నిఘా వర్గాలకు సమాచారం అందించారు. ఆ సమాచారాన్ని నిఘా బృందాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాయి.

నిషేధిత జైషే ఉగ్రవాద సంస్థ అయోధ్యను లక్ష్యంగా చేసుకుంది. రామజన్మభూమిలో మారణహోమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఉగ్రవాదులకు, జైషే మహ్మద్ సంస్థ చీఫ్‌కు మధ్య సమాచార మార్పిడి జరిగిందని నిఘా బృందాలు అనుమానిస్తున్నాయి. జైషే చీఫ్ మౌలానా మసూద్‌ అజర్ మెసేజ్‌లను నిఘా బృందాలు ఇంటర్‌సెప్ట్ చేశాయి. ఆ క్రమంలో ఇంటెలిజెన్స్ వర్గాలకు భయంకర విషయాలు తెలిశాయి. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్, అయోధ్యలో భీకర దాడులకు పన్నాగం పన్నినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారంతో యూపీ సర్కారు అప్రమత్తమైంది. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలోకి వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఖలిస్థాన్ ఉగ్రమూకలు, పంజాబ్‌పై గురి పెట్టినట్లు సమాచారం. పంజాబ్‌లో వరుసదాడులకు ఆయుధాలు సమీకరించినట్లు తెలుస్తోంది. ఉగ్ర సంస్థలు బబ్బర్‌ ఖల్సా, ఖలిస్తాన్‌ జిందాబాద్‌లు పాక్‌ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్‌, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడానికి ఐబీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక, ఐబీ హెచ్చరికలతో పంజాబ్‌ బోర్డర్‌లో భద్రతా దళాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్ర దాడులను నివారించడానికి ముందుజాగ్రత్త చర్యగా సాయుధ బలగాలను మోహరించి హైఅలర్ట్ ప్రకటించారు.

Tags

Next Story