అంతర్జాతీయం

ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం
X

ring-of-fire

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దాదాపు పదేళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. 3 గంటలపాటు కొనసాగిన ఈ ఖగోళ పరిణామంలో సూర్యుడు సప్తవర్ణాలతో కనువిందు చేశాడు. రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 44 సెకన్ల పాటు కనిపించింది.

ఉదయం 8 గంటల 8 నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది. సుమారు మూడు గంటలకు పైగా గ్రహణం కొనసాగింది. 11 గంటల 20 నిమిషాల సమయంలో గ్రహణం ముగిసింది. చంద్రుడి చుట్టూ ఉంగరం ఆకారంలో నీడ ఏర్పడడం వల్ల ఈ గ్రహణాన్ని వలాయాకార సూర్యగ్రహణం లేదా అంగుళీయక సూర్యగ్రహణం అంటారు. కేతు గ్రస్త సూర్యగ్రహణం అని జ్యోతిష పండితులు పేర్కొన్నారు.

దేశ, విదేశాల్లో రాజకీయ-సినీ-పారిశ్రామికరంగాల ప్రముఖులు ప్రముఖులు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం గ్రహణాన్ని చూడలేకపోయారు. మబ్బులు కమ్మి ఉండడంతో గ్రహణాన్ని చూడలేదని మోదీ తెలిపారు. ఐతే, కోజికోడ్, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలను చూశానని చెప్పారు. గ్రహణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలపై ఓ నెటిజన్ సరదాగా స్పందించాడు. ఇది మీమ్ కాగలదు అని ట్వీట్ చేయగా, మీ ఇష్టం కానివ్వండి అంటూ మోదీ కూడా సరదాగా జవాబిచ్చారు.

అరుదైన సూర్యగ్రహణం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహం చూపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థులు, శాస్త్రవేత్తలు గ్రహణాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించారు. ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ సూర్యగ్రహణం ఏర్పడే తీరు, ప్రాముఖ్యతను వివరించారు. ఇక, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దు, బయటకు రావొద్దనే వాదనలున్నాయి. ఆ అపోహలను పోగొట్ట డానికి హేతువాదులు, జనవి జ్ఞాన వేదిక నాయకులు అవగాహన సదస్సులు నిర్వహించారు. అందులో భాగంగా గ్రహణ సమయంలో అల్పాహారం ఏర్పాటు చేసి తినాలని ప్రజలను ప్రోత్సహించారు.

మనదేశంతో పాటు సౌదీ ఆరేబియా, ఖతార్‌, యూఏఈ తదితర దేశాల్లోనూ సూర్య గ్రహణం కనిపించింది. ఎక్స్-రే ఫిల్మ్‌లు, ప్రత్యేకంగా తయారు చేసిన సోలార్ ఫిల్టర్ ద్వారా సుందరఘట్టాన్ని వీక్షించారు.

సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి, బాసర, కాణిపాకం, యాదాద్రి, బెజవాడ కనకదుర్గ సహా పలు దేవాలయాలు మూతబడ్డాయి. టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. రాహు-కేతు పూజలు జరిగే దేవాలయాలను మాత్రం మూయలేదు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ తర్వాత భక్తులను అనుమతించారు.

గ్రహణం ముగిసిన తర్వాత ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. నదులు, సరస్సుల సమీపంలో ఉన్నవాళ్లు, నదిలో మునిగి పుణ్యస్నానాలు చేశారు. అయోధ్య, వారణాసి సహా పలు ప్రాంతాల్లో భక్తు లు వేలాదిగా నదీతీరాలకు తరలివచ్చారు.

ముస్లింలు కూడా గ్రహణకాలాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనదేశంతో పాటు పాకిస్థాన్‌లోనూ ప్రార్థనలు జరిగాయి.

ఈ ఏడాదికి ఇదే చివరి సూర్య గ్రహణం. వచ్చే ఏడాదిలో రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. 2020, జూన్‌ 21న, డిసెంబర్‌ 14న రెండు సార్లు సూర్య గ్రహణాలు రానున్నాయి.

Next Story

RELATED STORIES