పోలీసులే అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్న హాజీపూర్ కిల్లర్

పోలీసులే అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్న హాజీపూర్ కిల్లర్

haajipur

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్య కేసుల విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. ముగ్గురు బాలికలు మనిషా, శ్రావణి, కల్పనల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని నల్లగొండ మొదటి అదనపు సెషన్స్‌ కోర్టులో ఫోక్సో చట్టం కింద విచారిస్తున్నారు. మనీషా కేసులో వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ పూర్తి అయింది. దీంతో సాక్షుల వాంగ్మూలాలు చదివి వినిపించిన జడ్జీ నిందితుడి అభిప్రాయం తెలుసుకుంటున్నారు.

సాక్షుల వాంగ్మూలాలను ఒక్కొక్కటిగా వినిపిస్తూ దానిపై నిందితుడు శ్రీనివాసరెడ్డి సమాధానాలు తెలుసుకున్నారు జడ్జి. అయితే.. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నల్లో ఎక్కువగా కాదు, లేదు, తెలియదు లాంటి దాటవేత సమాధానలు చెప్పాడు శ్రీనివాసరెడ్డి. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదన్నాడు నిందితుడు. అంతేకాదు పోలీసులే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపించాడు.

హత్య జరిగిన రోజు తన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశానని.. అందుకే టవర్‌ లొకేషన్‌ ఆ ప్రాంతంలో చూపిందని నిందితుడు వెల్లడించాడు. అయితే.. ఈ కేసులో ఎవరైనా సాక్షులను తీసుకువస్తావా అని న్యాయమూర్తి నిందితుడిని ప్రశ్నించగా తన కుటుంబ సభ్యులను తీసుకువస్తానని చెప్పాడు. దీంతో సాక్షులను తీసుకువచ్చేందుకు కోర్టు సమయం కేటాయించింది. జనవరి 3వ తేదీన సాక్షులను తీసుకురావాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story