బయోపిక్‌లు లాభమా.. నష్టమా

బయోపిక్‌లు లాభమా.. నష్టమా

biopicsకొందరి జీవితాలు సినిమా కథలకంటే రసవత్తరంగా ఉంటాయి. కథానాయకులు కల్పిత గాథల్లోంచి కాదు.. అప్పుడప్పుడు నిజ జీవితంలోంచి కూడా వస్తారు.. జనరేషన్స్ ని ఇన్పైర్ చేసే ఆ కథలు సినిమా రూపం దాల్చినప్పుడు వచ్చే కిక్కే వేరు. 'మహానటి'తో తెలుగు లో బయోపిక్స్ ఊపందుకున్నాయి. మరి ఆ దారి లో మరి కొందరి నిజ జీవిత గాధలు వెండితెరపై ప్రత్యక్ష్యం అయ్యాయి. వాటిల్లో ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి చెప్పాలి. ఎన్టీఆర్.... తెలుగునాట ఈ పేరు వినగానే అందరికీ ‘అన్నగారు’ అనే మాట అప్రయత్నంగా నోటి నుండి వస్తుంది. అంతటి ఖ్యాతినార్జించిన వెండితెర వేలుపు, ముఖ్యమంత్రి అనే పదానికి కొత్త అర్ధం చెప్పిన నాయకుడు. తరాలు మారినా తరగని అభిమానం సంపాదించిన నందమూరి తారక రాముడి గాధ ఈ యేడాది ప్రారంభంలోనే వెండి తెరమీదకు వచ్చింది. ఎన్టీఆర్ పేరుతోనే జనవరి 9న ఫస్ట్ పార్ట్ విడుదలై సంక్రాంతి సంబరాలను తెలుగు ప్రేక్షకులకు ముందే తెచ్చింది.. సావిత్రి బయోపిక్ గా గతేడాది వచ్చిన మహానటి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఎన్టీయార్ కథానాయకుడు మార్కెట్ కూడా బాగా పెరిగింది. బాలకృష్ణ కెరియర్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మారిన ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడికి బాలకృష్ణే నిర్మాత. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచింది.

దర్శకుడు క్రిష్ కొన్ని పరిధులు మధ్య పనిచేసాడని అనిపించేలా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు తెరమీద కనిపించాడు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ మద్య మనస్పర్ధలు కానీ, క్రిష్ణ తో వచ్చిన అభిప్రాయ బేధాలు కానీ క్రిష్ణ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నిర్మించిన సినిమాల ఊసు లేకుండా కేవలం ప్రశంసా పత్రంగా మారిన ఎన్టీఆర్ బయోపిక్ చప్పగా సాగిందనే విమర్శలు మూట గట్టుకుంది. ఎన్టీఆర్ మెండితనం తెలుగు సినిమాకు కొత్త పాఠాలను నేర్పింది. దానవీర శూరకర్ణ, భీష్మ, నర్తనశాల వంటి గొప్ప చిత్రాలకు కారణం ఆయన మీద ఆయనకు ఉన్న అపార నమ్మకం. కానీ ఆ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు చాలా ఉన్నాయి. వాటిని ప్రభావవంతంగా తెరమీదకు కథానాయకుడు టీమ్ తీసుకురాలేకపోయింది..

ఫిబ్రవరి 22న విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు విషయంలో కూడా అదే జరిగింది. రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ పధకాల వెనుక ఆయన ఆలోచనలను ఎలివేట్ చేయడంలో టీం సక్సెస్ కాలేదు. ఇక ఎన్టీఆర్ గెటప్ప్స్ లో బాలకృష్ణ నటన ఆయన కెరియర్ లోనే బెస్ట్ గా నిలిచింది. విద్యాబాలన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకా కీరవాణి నేపధ్య సంగీతం.. నందమూరి అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని కలిగించాయి. నిజ జీవిత గాధలను తీసుకున్నప్పుడు అందులో సంఘర్షణలను తప్పకుండా ఎలివేట్ చేయాలి, సావిత్రి జీవితంలోని సంఘర్షణ ను మహానటి చూపించ గలిగింది కాబట్టి అది ప్రేక్షకుల మెప్పును, జాతీయ పురస్కారాలను పొందింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలో విషయంలో అది స్పష్టంగా కనిపించిన లోటు.

తెలుగు నాట పాదయాత్ర అనే పేరు వినగానే గుర్తుకు వచ్చే నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అంతకు మందు పాదయాత్రలు జరిగినా, రాజశేఖర్ రెడ్డి చూపించిన ప్రభావం ముందు తక్కువే అని చెప్పాలి. ఆ పాదయాత్రనే యాత్ర పేరుతో సినిమాగా తీసి విజయాన్ని అందుకుంది టీమ్. రాజశేఖర్ రెడ్డి జీవితంలోనూ, తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న యాత్ర వెండితెరపై గౌరవం దక్కించుకుంది. రాయలసీమ ప్రాంతంలో పుట్టిన దర్శకుడు మహి.వి.రాఘవ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వింటూ పెరిగాడు. ఆయన రాజకీయ జీవితంపై కలిగిన గౌరవం యాత్రకు శ్రీకారం చుట్టింది.

మమ్ముట్టి వంటి ప్రతిభావంతుడైన నటుడు రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయాడు, గౌరవాన్ని ఆపాదించాడు. పాదయాత్ర లో తనను తిరిగి వెళ్ళమని అడ్డుపడిన సన్నివేశాలను తెరమీదకు తీసుకురాగలిగాడు దర్శకుడు మహి. కెవిపికి రాజశేఖర్ రెడ్డి ఇచ్చే గౌరవం...ఒక సన్నివేశంలో చాలా బాగా ఆవిష్కరించాడు. వస్తే ఇద్దరం వస్తాం.. లేదంటే ఇద్దరం రాము అని కాంగ్రెస్ హై కమాండ్ కి చెప్పే సీన్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఇక సొంత పార్టీలో తనపై జరుగుతున్న కుట్రలు, అభ్యర్ధులను ఎంచుకునే సందర్భంలో ఆయన ఎంత ఖచ్చితంగా ఉండేవాడో వంటి విషయాలు తెరపై చూపించడంతో రాజశేఖర్ రెడ్డి మీద గౌరవాన్ని పెంచాయి. చివరిలో రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో చనిపోయిన విజువల్స్ తో సినిమాను ముగించి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. బయోపిక్ లో బయటికి తెలిసిన విషయాలను చూపిస్తూనే తెలియని విషయాలను నిజాయితీగా ప్రజెంట్ చేయగలగాలి. ఆ బాలెన్స్ ని మహి చూపెట్టాడు కాబట్టి కమర్షియల్ గా మామూలు విజయాన్ని అందుకున్నా గౌరవాన్ని దక్కించుకోవడంలో మాత్రం యాత్ర సక్సెస్ అయ్యింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ .. కథానాయకుడు, మహానాయకుడు చెప్పిన కథ ప్రజలకు తెలియాల్సిన కథ అంటూ ఆర్జీవి సంధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాలతో పాటు ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. సెన్సార్ తోనూ, కోర్టు కేసులతో కుస్తీలు పడి ఎట్టకేలకు తెలంగాణాలో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. కానీ ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్...ఇది కుటుంబ కుట్రల కథ. ఈ ట్యాగ్ లైన్ తోనే సినిమాపై అంచనాలను పెంచాడు రామ్ గోపాల్ వర్మ. కంటెంట్ విషయంలో విభేదాలున్నా, కాస్టింగ్ ని పట్టుకోవడంలో దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు విజయకుమార్ వంటి రంగస్థల నటుడ్ని ఎన్టీఆర్ గా ఆవిష్కరించాడు. శ్రీతేజ్ చంద్రబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే, యజ్ఞాశేట్టి లక్ష్మీపార్వతిగా మారిపోయింది. ఆర్జీవి చిత్రాలు విడుదలకు ముందు ఉన్న హాడావుడి విడుదల తర్వాత ఉండదని లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ప్రూవ్ చేసింది. చేసింది లిమిటెడ్ బడ్జెట్ లో కాబట్టి వచ్చిన ఒపెనింగ్స్ సినిమాకి కమర్షియల్ సక్సెస్ ను అందించాయి.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తో కలెక్షన్స్ ని ‘లెట్స్ డు కుమ్ముడు’ అనేసాడు. వెంటనే కొణిదెల ప్రొడక్షన్స్ లో ‘‘సైరా నరసింహారెడ్డి ని ఎనౌన్స్ చేసి తన రీ ఎంట్రీలో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. సైరా నరసింహా రెడ్డి.. బ్రిటీష్ అరాచకాలకు ఎదురు నిలిచి పోరాడిన యోథుడు. ఆత్మాభిమానంకు మించిన సంపద ఉండదని బానిసత్వం కు మించిన శిక్ష లేదని నినదించిన వీరుడు. ఆ చరిత్రను వెండితెరమీదకు మెగాస్టార్ తీసుకురావడంతో సౌత్ సినిమా వైపు మరోసారి అందరి దృష్టి పడింది. జనం లోకి పెద్దగా తెలియని వీరుడి కథ, దొంగగా చిత్రీకరించ బడిన ఒక తిరుగుబాటు దారుని కథ. ఉరికొయ్యలకు దశాబ్దాల పాటు ఆయన తల వేలాడదీసారు అంటే ఆయన కలిగించిన భయం ఏపాటిదో అర్దం అవుతుంది. అలాంటి కథను తెరమీదకు తెచ్చారు మెగా ఫ్యామిలి..

సైరా కు భుజం కాసిన అమితాబ్, సుదీప్, విజయ్‌సేతుపతిలు ఆ ప్రాజెక్ట్ కి ఇతర భాషల్లో బజ్ క్రియేట్ చేయడానికి తమ వంతు సాయం చేసారు. చిరంజీవి చేసిన పోరాటాలు... తెరమీద ఆయన చూపిన నటన తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. తెరమీద చిరంజీవిని ఒక తిరుగు బాటు దారునిగా, బ్రిటీష్ అకృత్యాలను ఎదుర్కొన్న వీరుడుగా చూడటం ఫ్యాన్స్ కే కాదు ప్రేక్షకులకు కూడా పండుగగా మారింది. అయితే కమర్షియల్ గా ‘సైరా’ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. హిందీ, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో సైరా సత్తా చాటలేకపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో సైరా తన దమ్ము చూపించాడు.

జార్జిరెడ్డి విడుదలకు ముందు చాలా బజ్ ని సాధించాడు. విద్యార్ది నేతగా, మేథావిగా ఉస్మానియా క్యాంపస్ లో ఎప్పటికీ నిలిచిపోయే ధృవతార జార్జిరెడ్డి . ఆయన ఆలోచనలు , పోరాటాలు ఉస్మానియా క్యాంపస్ కే కాదు.. ప్రతి విద్యార్ధి పోరాటంలోనూ స్పూర్తిగా నిలుస్తాయి. ఆ నాయకుడు వెండితెర మీద ఎలా ఉండబోతున్నాడు అనే ఇంపాక్ట్ జార్జిరెడ్డి పై అంచనాలు పెంచింది. వీటితో పాటు మల్లేశం, రఘుపతి వెంకయ్యనాయుడు బయోపిక్ లు కూడా ఈ యేడాది వెండితెరమీద కొత్త కథలకు ప్రాణం పోసాయి. జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పై లడ్నా సీకో.. ఈ నినాదంతో ప్రతి పోరాటానికి స్పూర్తినిచ్చిన జార్జిరెడ్డి కథ వెండి తెరమీద మాత్రం అంతగా జనరంజకంగా మారలేకపోయింది. ఈ సినిమాకి వచ్చిన హైప్ ని సినిమాలోని కంటెంట్ నిలబెట్టుకోలేకపోయింది. జార్జిరెడ్డి పాత్రలో సందీప్ చక్కగా ఒదిగిపోయాడు. ముస్కాన్ సేథి , అభయ్ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. కానీ జార్జిరెడ్డి పోరాటం తాలూకు స్పూర్తి కంటే, ఆయన ఆవేశాన్ని ఎక్కువుగా ప్రొజెక్ట్ చేసాడు దర్శకుడు జీవన్ రెడ్డి. జార్జిరెడ్డి జీవితం కథగా చదువుతున్నప్పుడు రగిలిన ఆవేశం తెరమీదకు తీసుకురావడంలో టీం పూర్తిగా సక్సెస్ కాలేదు. దీంతో జార్జిరెడ్డి ఒక మంచి ప్రయత్నంగానే మిగిలిపోయాడు.

హిందీలో ప్యాడ్ మాన్ తరహాలో తెలంగాణాలో చింతకింది మల్లేశం కథ కూడా మంచి ప్రశంశలు పొందింది. ‘అసు’ యంత్ర సృష్టికర్తగా నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన చింతకింది మల్లేశం వెండితెర మీద స్పూర్తిదాయకంగా మారాడు. కమెడియన్ గా ముద్రను వేసుకున్న ప్రియదర్శిలో ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడని నిరూపించిన చిత్రం ‘మల్లేశం’. దర్శకుడు రాజ్ ఈ సినిమాను పూర్తిగా రియలిస్టిక్ గా మలిచాడు. అనన్య వంటి ప్రతిభా వంతమైన నటి ఈ సినిమాతో పరిచయం అయ్యింది. ఒక మంచి సంకల్పం ఎన్ని అడ్డంకులనైనా దాటే శక్తిని ఇస్తుంది. అదే మల్లేశం కథ.. ఎన్నిసార్లు ఒడిపోయనా , తిరిగి చేసే ప్రయత్నం తెచ్చే విజయం ఒక చరిత్ర అవుతుంది అని నిరూపించిన చింతకింత మల్లేశం కథ వెండి తెరమీద గొప్ప ప్రయత్నంగా మిగులుతుంది. హిందీలో ప్యాడ్ మాన్ కు అక్షయ్ కుమార్ స్టార్ వాల్యూ ఎంత యాడ్ అయ్యిందో , మల్లేశం సినిమా కు వచ్చిన కమర్షియల్ లెక్కలు చూస్తే అర్దం అవుతుంది.

తెలుగు సినిమా పితామహుడు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ కథ తెరమీదకు రావడానికి, ఆయన సినిమా తెరమీదకు తీసుకురావడానికి పడిన కష్టంతో సమానం. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఈ యేడాది చివరిలో తెరమీదకు వచ్చింది. నరేష్ ఈ పాత్రకు ప్రాణం పోసాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దర్శకుడు బాబ్జి రఘుపతి కథను చాలా ఎమోషనల్ గా మలిచాడు. ఇప్పటి నుండి రఘపతి వెంకయ్యానాయుడు చరిత్ర సినిమా రూపంలో అందుబాటులో ఉంటుంది. అదే రఘుపతి వెంకయ్యనాయుడికి మనం చూపే కొద్దిపాటి కృతజ్ఞత. బయోపిక్స్ తీసేటప్పుడు గొప్పలను, తప్పులను చూపగలిగే బాలెన్స్ తప్పని సరిగా అవసరం. అందుకే ఈయేడాది వచ్చిన బయోపిక్స్ లో సైరా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తే, మల్లేశం చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. మిగిలిన బయోపిక్స్ కొంత మేర ఆకట్టుకోగలిగాయి. తెలుగు సినిమా ఇండస్ట్ర్రీలో ఎక్కువ బయోపిక్స్ వచ్చిన సంవత్సరంగా 2019కి ప్రత్యేక స్థానం దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story