గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం.. నిర్ణయాలు ఇవే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతోంది.. ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టిన హస్తం నేతలు.. జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్రం అమలు చేస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించండి-రాజ్యాంగాన్ని రక్షించండి పేరుతో నిరసనలను పిలుపునిచ్చింది.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గాంధీ భవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ అనేక అంశాలపై చర్చించింది.
కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీ సహా ఎటువంటి ప్రదర్శనలకు హైదరాబాద్‌లో అనుమతించే ప్రసక్తిలేదని పోలీసు శాఖ ప్రకటించడం, ర్యాలీ నిర్వహించి తీరుతామని పీసీసీ ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదీ ఏమైనా ర్యాలీ నిర్వహిస్తామని తేల్చేసిన పీసీసీ చీఫ్..పార్టీ కార్యకర్తలు, నేతలు గాంధీభవన్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ క్లియర్ చేసి ఆరెస్సెస్ కవాతుకు ఎలా అనుమతిచ్చారని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్ ప్రశ్నించారు. ఆరెస్సెస్ ర్యాలీకి సంబంధించిన వీడియోను పవర్ పాయింట్ ద్వారా మీడియాకు చూపించారు. అలాగే నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. మజ్లీస్, బీజేపీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందేనని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ఇక 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com