ఆ గ్రామాల్లో కీటకాల కల్లోలం.. వేలాది ఎకరాల పంట నాశనం

గుజరాత్, రాజస్థాన్ లోని గ్రామాల్లో కీటకాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు కావటంతో బుల్లెట్ల దాడులతో ఆందోళన చెందే గ్రామాలు... ఇప్పుడు మిడతల సౌండ్ వింటేనే వణికిపోతున్నారు. శత్రు మూకలు దాడి చేసినట్లు ఒక్కసారిగా పంటల మీద పడిపోయాయి. ఏకంగా వేల కొద్ది ఎకరాల పంట చూస్తుండగానే నాశనం అయ్యింది.
గుజరాత్ లోని బనాస్ కాంఠా, మెహసాణా, కచ్ , పాఠన్ , సాబర్ కాంఠా జిల్లాలో మిడతల దండు దాడి తీవ్రత ఎక్కువగా ఉంది. రాజస్థాన్ లోని జోలార్ జిల్లాలోనూ కీటకాలు దండెత్తాయి. ఒక్క బనాస్ కాంఠా జిల్లాలోనే 5వేల హెక్టార్లలో పంటకు నష్టం కలిగింది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడిన మిడతల ధాటికి ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంప, గోధుమ, పత్తి పంటలు ఎందుకు పనికీరాకుండా పోయాయి.
చూస్తున్నారుగా పంట మొక్కల నిండా మిడతలే. కనుచూపు మేర మిడతలే. కుప్పలు తెప్పలుగా తిష్టేసాయి. వీటి ధాటికి పంటలు నాశనం అవుతుండటంతో రైతులు సాంప్రదాయ పద్దతిలో మిడతలను తరిమేందుకు ప్రయత్నించారు. పొలాల్లో టైర్లను మండించడం, డప్పు, ప్లేట్లను మోగించడం, పొలాల వద్ద టేబుల్ ఫ్యాన్ లు పెట్టడం, లౌడ్ స్పీకర్లతో ఆ కీటకాలను చెదరగొట్టాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మొండిబారిన మిడతలు ఒక్క పట్టాన పంటలను వదలటం లేదు. దీంతో రైతులు ఎన్ని ప్రయాసాలు పడినా ప్రయోజనం ఉండటం లేదు.
కీటకాల ధాటికి పంటలు చేతికి అందకుండా పోతుండటంతో వీటిని ఎదుర్కోవడానికి గుజరాత్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కు 11 బృందాలను పంపింది. బనాస్ కాంఠా జిల్లాలో 1815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను చల్లించామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించామని, మరో 4 రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు తెలిపారు.
మిడతల దండు ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చి ఊడిపడ్డాయి? పంటలపై మిడతల దండు అప్పుడప్పుడు ఇలా దాడి చేస్తుంటాయి. పదేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో దండెత్తిన కీటకాలు గుజరాత్, రాజస్థాన్ లో పంటలన్నింటిని నాశనం చేసేశాయి. ఇక ప్రస్తుతం ఆఫ్రికాలోని సూడాన్, ఎరిట్రియా నుంచి పాకిస్తాన్ మీదుగా మన దేశంలోకి చొరబడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com