ఏకపక్షపోరులో మేరీకోమ్ విజయం

ఏకపక్షపోరులో మేరీకోమ్ విజయం

marry-kom

ఊహించిందే జరిగింది. ప్రపంచ ఛాంపియన్‌ను సవాల్‌ చేసిన నిఖత్‌ జరీన్‌ చిత్తయ్యింది. మేరీకోమ్‌ పంచ్‌ల ధాటికి రింగ్‌లో కుప్పకూలింది. ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో జరిగిన కీ ఫైట్‌లో.. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ ఘన విజయం సాధించింది. 51 కేజీల విభాగంలో జరిగిన పోరులో మేరీకోమ్‌ 9-1 తేడాతో నిఖత్‌ జరీన్‌పై గెలుపొందింది. ఫలితంగా ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించింది.

ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్‌ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తనకంటే వయసులో ఎంతో చిన్నదైన నిఖత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది.

51 కేజీలో విభాగంలో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌ నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ జరిగింది. మేరీకోమ్‌ గత రికార్డులను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్‌ సమాఖ్య నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్..‌ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో వీరి మధ్య మ్యాచ్‌ను నిర్వహించారు.

అయితే మ్యాచ్‌ తరువాత నిఖత్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు మేరీ నిరాకరించింది. ఆమెతో తాను ఎందుకు చేతులు కలపాలి? అని ప్రశ్నించింది. ఇతరులు ఆమెను గౌరవించాలంటే ముందు ఆమె ఇతరులను గౌరవించాలని మేరీ అభిప్రాయపడింది. అలాంటి స్వభావం కలిగిన వారంటే తనకు నచ్చరంది మేరీ.

మేరీకోమ్‌ తనతో వ్యవహిరించిన తీరు నచ్చలేదని నిఖత్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితం ప్రకటించాక ఆమెను తను హత్తుకోవాలని చూశానని.. కాని మేరీ అలా చేయడం తనకు నచ్చలేదన్నారు జరీన్‌.

Tags

Read MoreRead Less
Next Story