దేశ రాజకీయం అంతా CAA, NRC చుట్టూనే కేంద్రీకృతం

దేశ రాజకీయం అంతా CAA, NRC చుట్టూనే కేంద్రీకృతం
X

caa

దేశ రాజకీయం అంతా ఇప్పుడు CAA, NRC చుట్టూనే కేంద్రీకృతం అయింది. సీఏఏ అమలు మద్దతు, వ్యతిరేక ర్యాలీలు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, కేరళా, ఆంధ్రప్రదేశ్ తో పలు ప్రాంతాల్లో సీఏఏ, ఎఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఢిల్లీలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామా మసీదు ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

మరోవైపు బీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని, ఎన్నార్సీని, సీఏఏను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు ప్రధాని ఇంటిని ముట్టడించడానికి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అటు ఉత్తరప్రదేశ్ లో ఉద్రిక్త కొనసాగుతోంది. నిన్న శుక్రవారం కావటంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని నిరసన కారుల నుంచే వసూలు చేస్తుండటంతో బులందేశ్వర్ లో నిరసనకారులు 6లక్షల డీడీని అందజేశారు. తమ కారణంగానే జరిగిన ఆస్తి నష్టంగా డీడీని ఇస్తున్నామని అన్నారు.

సీఏఏ మద్దతుగా ముంబైలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొని సీఏఏ బిల్లుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

కేరళలో CAA మద్దతుగా జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ర్యాలీగా వెళ్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇక సీఏఏ, ఎన్నార్సీపై పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. సీఏఏ మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న మమతా బెనర్జీ తాను బ్రతికి ఉండగా బిల్లును అమలు చేయనివ్వబోమని సంచలన ప్రకటన చేశారు.

సీఏఏ, ఎన్నార్సీతో పేదలు నష్టపోతారని ఆరోపించారు రాహుల్ గాంధీ. బీద వర్గాన్ని దోచుకొని పెద్దలకు లాభం చేకూర్చే మరో ప్రక్రియే ఎన్నార్సీ, ఎన్నార్పీ అని అన్నారాయన.

అయితే..ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టి పారేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. CAA, NRCపై కాంగ్రెస్ పుకార్లు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఏఏ, ఎన్నార్సీ కలిపి అమలు చేస్తే భారత్ లోని ముస్లిం వర్గంపై ప్రభావం పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సీఆర్ఎస్ అభిప్రాయపడింది. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను కాంగ్రెస్ సభ్యులకు కమిటీ అందజేసింది. భారత చరిత్రలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం కల్పిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Tags

Next Story