మూడు రాజధానులపై హైపవర్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో 10 మంది మంత్రులు, ఆరుగురు ఉన్నతాధికారులతో ఈ కమిటీ వేశారు. బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, సుచరిత, కొడాలి నాని, మోపిదేవి, పేర్ని నాని, కన్నబాబుతోపాటు డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం సహా మరికొందరు ఇందులో ఉన్నారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వ్యవహరిస్తారు. సీసీఎల్‌ఏ, పురపాలక శాఖ, న్యాయశాఖ కార్యదర్శలు కూడా సభ్యులుగా ఉంటారు.
GN రావు కమిటీ ఇప్పటికే తన నివేదికను సమర్పించింది. ఇటీవల జరిగిన కేబినెట్‌లో దీనిపై చర్చించారు. అలాగే జనవరి 3వ తేదీకల్లా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్- BCG ఇచ్చే నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఆ రెండు రిపోర్ట్‌లు అధ్యయనం చేస్తుంది. 3 వారాల్లో ఈ ప్రక్రియంతా పూర్తి చేసి తుది నివేదికను సమర్పిస్తుంది. దీని ఆధారంగానే జనవరి చివరివారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. శాసనసభ, మండలి సభ్యుల ఉమ్మడి సమావేశం నాటికల్లా ఈ హైపవర్ కమిటీ.. GNరావు నివేదిక, BCG నివేదికలో అంశాల ఆధారంగా సమగ్ర రిపోర్ట్ ఇవ్వనుంది. అవసరమైతే అడ్వొకేట్ జనరల్‌తో మాట్లాడి న్యాయ సలహా కూడా తీసుకోనున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా అధ్యయనం చేయాలి కాబట్టి.. కీలకమైన శాఖలకు సంబంధించిన మంత్రులు, అధికారుల్ని కమిటీలో చేర్చారు. ఆర్థిక శాఖ, రెవెన్యూ-రిజిస్ట్రేషన్లు, మున్సిపల్ శాఖ, పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, హోమ్, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లైస్, రవాణా శాఖలతోపాటు DGPని కూడా కమిటీలో చేర్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com