పెరిగిన చలి తీవ్రత.. స్కూళ్లకు సెలవులు

పెరిగిన చలి తీవ్రత.. స్కూళ్లకు సెలవులు

cold

ఉత్తరాదిని చలి చంపేస్తోంది. ఎముకలు కొరికే చలితో దేశరాజధాని వాసులు గజ గజ వణికిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో ఉదయం లేచి బయటకు రావాలంటేనే ఢిల్లీ జనం వణికిపోతున్నారు. 2.4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సీజన్‌లో ఇంత తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి.

ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చలిలోనే ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. చలి కారణంగా ఢిల్లీలో అధికారులు రెడ్ అలర్ట్‌ ప్రకటించారు. స్కూళ్లకు రెండో రోజుల సెలవులు ప్రకటించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ నగరాన్ని పొగ మంచు కప్పేసింది. ఉదయం 10 దాటినా మంచు తెరలు తొలగని పరిస్థితి. దీంతో వాహనరాకపోకలు, రైలు సర్వీసులకు అంతరాయం తప్పడం లేదు. అంతే కాదు విమాన సర్వీసులపై కూడా పొగ మంచు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

ఈ నెల 14 నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజు రోజు పడిపోతూ వస్తున్నాయి. మరో రెండు రోజులు ఇలాగే కొనసాగితే దాదాపు 120 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా ఈ ఏడాది నిలవనుంది.1901వ సంవత్సరంలో కూడా ఇదేవిధంగా డిసెంబర్‌ నెలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజుల్లో మరింత చలి పరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, చంఢఘీడ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే రోజుల్లో చలి గాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుర్ఫి, మనాలీ, సోలాన్‌ తదితర ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక జమ్మూ కశ్మీర్ చలికి గజ గజ వణికిపోతోంది. మామూలుగానే మంచుతో వణికే కశ్మీర్‌.. వింటర్‌ రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏకంగా దాల్‌ సరస్సు కూడా గడ్డ కట్టే పరిస్థితి. దీంతో ఎవరూ బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. స్వెట్టర్లు ధరించి, వేడి మంటలను కాచుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు జనం.

Tags

Read MoreRead Less
Next Story