అర్థరాత్రి రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత

రాజధాని మార్పు నిర్ణయం మరికొన్ని రోజుల పాటు వాయిదా పడినా.. అమరావతిలో ఆందోళనలు ఆగడం లేదు. రాజధానిలోని 29 గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని పరిసరాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం చేశారు. ఆదివారం 12వ రోజు కూడా నిరసనలతో హోరెత్తిస్తున్నారు రైతులు. ఉదయాన్నే మందడంలో మహాధర్నా చేపట్టారు రాజధాని రైతులు. అటు వెలగపూడిలో 12వ రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మహిళలు, చిన్నపిల్లలు అంతా కలిసి దీక్షలు చేస్తున్నారు. తుళ్లూరులో కూడా వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్న రైతులు. వెంటనే రాజధాని తరలింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో అర్థరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. వెంకటపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కొంత మంది రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమను నేరస్తుల్లా చూస్తున్నారని మండిపడుతున్నారు.
అటు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. అఖిలపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. గత 12 రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com