జార్ఖండ్‌ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్ ప్రమాణస్వీకారం..

జార్ఖండ్‌ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్ ప్రమాణస్వీకారం..

hemanth

జార్ఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘనవిజయం సాధించడంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాంచీలోని మొరాబది గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. సోరెన్‌తో పాటు జేఎంఎం నుంచి ఒకరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశంలోని విపక్ష పార్టీల మెగా షోకు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం వేదిక కానుంది. గత ఏడాది కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమార స్వామి ప్రమాణస్వీకారంలోనూ విపక్ష పార్టీలు బలప్రదర్శనతో ఐక్యత చాటుకున్నాయి.

హేమంత్‌ సోరెన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు హాజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, DMK అధ్యక్షుడు MK స్టాలిన్, TDP అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, RJD కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వి యాదవ్ తదితరులు హాజరయ్యే అవకాశాలున్నాయి. జార్ఖండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కూడా హాజరుకానున్నారు. ఆయనను సోరెన్ స్వయంగా ఫోను చేసి మరీ ఆహ్వానించారు.

జార్ఖండ్‌ ముక్తి మోర్చా, దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీల్లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. దీని ప్రకారం JMM నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. లేదా మరో మంత్రి పదవి వరించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో JMM 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story