కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతి కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టాడనికి అంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ గారు అవే పాత లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో 1170 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని.. మరి 4 వేల 75 ఎకరాల ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఎలా జరిగిందో.. భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నేతలు, ఉపసంఘం మేధావులు చెప్పాలని ప్రశ్నించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. జగన్ గారు ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్ విచారణకు తాము సిద్ధమన్న లోకేష్.. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీకి వైసీపీ సిద్ధమా అని సవాల్ చేశారు.
అటు అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు తేలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలను కొట్టిపారేశారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ రాజధానిగా అమరావతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తుచేశారు. అబద్ధాలు చెప్తూ.. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని కనకమేడల విమర్శించారు.
జగన్ పాలనపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. జగన్ తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అమర్నాథ్ రెడ్డి ఫైరయ్యారు.
రాజధాని ప్రకటన తర్వాత విశాఖపట్నంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. విశాఖ భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్ లో సచివాలయం ఉంటే పాలన ఎలా సాగుతుందని ప్రశ్నించారు. రాజధానిపై రైతులు రోడ్డెక్కుతుంటే ప్రభుత్వానికి పట్టదా అని నారాయణ ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై ఈనెల 30న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com