పేజావర్ మఠ స్వామీజీ విశ్వేశ తీర్థ ఆరోగ్య పరిస్థితి విషమం

ప్రసిద్ధ ఉడుపి పేజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం మణిపాల్ KMC ఆస్పత్రిలో చేర్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య నిపుణులతో పాటు.. KMC ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మొదట కాస్త కోలుకున్నప్పటికీ.. ఆ తర్వాత స్వామీజీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.
ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న స్వామీజీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కర్ణాటక సీఎం యడియూరప్ప స్వయంగా ఆస్పత్రికి వెళుతూ స్వామీజీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సైతం స్వామీజీ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. విశ్వేశ స్వామీజీ తనకు సన్యాసం ఇచ్చిన గురువు అని ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని అన్నారు. స్వామీజీ చూపిన దారిలోనే మనం నడవాలని.. శ్రీ కృష్ణుడే ఆయన్ను కాపాడాలని ఉమాభారతి ప్రార్థించారు. అటు.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం స్వామీజీ ఆరోగ్య పరిస్థితి గురించి తరచూ వాకబు చేస్తున్నారు. ఆయనకు అందుతున్న చికిత్సపై మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
1931లో జన్మించిన విశ్వేశ తీర్థ స్వామీజీ.. 7వ ఏటనే.. అంటే 1938లోనే సన్యాసం స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ అందరికీ ఆరాధ్య దైవంగా మారారు. 88 ఏళ్ల స్వామీజీ కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. 8 రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. అయితే స్వామీజీ ఆస్పత్రిలో ఉండే కన్నా.. ఉడుపిలోని పెజావర్ మఠంలో ఉండడానికే ఇష్టపడుతున్నారని.. ఆయన కోరిక మేరకే ఆదివారం ఉడుపి తీసుకెళ్తున్నట్లు మఠాధికారులు తెలిపారు. అక్కడే వెంటిలేటర్ ఏర్పాటు చేసి స్వామివారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామీజీ ఆరోగ్యం కుదుటపడాలని భక్తులందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని వివిధ మఠాల స్వామీజీలు ఆకాంక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com