విశాఖ ఉత్సవ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం

ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. విశాఖ పర్యటనలో ఏదో చెప్తారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అక్కడి ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశారు ముఖ్యమంత్రి జగన్. విశాఖ ఉత్సవ్‌లో సీఎం మౌనముద్ర వహించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. అంతకు ముందు నగరంలో పర్యటించిన జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
విశాఖ ఉత్సవ్ సాగర తీరానికి కొత్త అందాలను తీసుకొచ్చింది. అయితే, వైసీపీ నేతలు, అక్కడి ప్రజలను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజధానుల వివాదం మొదలయ్యాక మొదటిసారి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్. ఏం మాట్లాడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అందరి ఆశలను తలకిందులు చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా విశాఖ పర్యటనను ముగించేశారు. ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థంకాక కొత్త రాజధానిపై గంపెడాశలు పెట్టుకున్న విశాఖ వాసులు నీరసపడిపోయారు. సీఎం నోటి వెంట అమృత వాక్కులు వింటారని కొద్దిరోజుల క్రితం మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పడంతో ఏదో చెప్తారని అంతా ఎదురుచూశారు.. అమృత వాక్కుల సంగతి పక్కన పెడితే పర్యటన మొత్తంలో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
విశాఖ ఉత్సవాలకు గతంలో ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనతో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారనుందని ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారి విశాఖ పర్యటనకు రావడంతో జగన్ ఏం చెప్తారోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ దిగింది మొదలు అడుగడుగునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పర్యటించే 24 కిలోమీటర్ల పొడవునా ధన్యవాదాలు తెలుపుతూ మానవహారం నిర్వహించారు. వెల్‌కమ్ బోర్డులు చేత బట్టి ఉత్సాహంగా స్వాగతం పలికారు. వైసీపీ నేతలు కూడా కార్యక్రమాన్ని నిర్వహించడంలో విజయవంతం అయ్యారు. అయితే, సీఎం జగన్ విశాఖకు వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. సీఎం పర్యటించిన మూడు ప్రాంతాల్లో చిరునవ్వు మినహా చిన్న మాట కూడా మాట్లాడలేదు.
కైలాసగిరిపై VMRDA కు చెందిన రూ.380 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షోను జగన్ తిలకించారు. అనంతరం విశాఖ ఆర్కేబీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక లేజర్‌షోతో నిర్వాహకులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం వేదిక పైకి వచ్చిన జగన్ లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. సుబ్బిరామిరెడ్డి సహా పలువురు నాయకులు ఆయన్ను సన్మానించారు. అయితే అనూహ్యంగా జగన్ ఏమీ మాట్లాడకుండానే సభ నుంచి వెనుదిరిగారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏమాత్రం ఊహించలేకపోయిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అయోమయానికి గురయ్యారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు అవకాశం కలిగించింది. అయితే, రాజధానిపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిదనే అభిప్రాయం కావచ్చని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com