రాజధాని రైతులకు బెయిల్.. పోలీసుల తీరుపై మండిపడ్డ మంగళగిరి కోర్టు

రాజధాని రైతులకు బెయిల్.. పోలీసుల తీరుపై మండిపడ్డ మంగళగిరి కోర్టు

far

అమరావతి రైతులు మరికాసేపట్లో విడుదల కానున్నారు. ఆదివారం అరెస్టైన ఆరుగురికి మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. కత్తులు ఎక్కడ, ఎవరైనా దాడిలో గాయపడి ఐసీయూలో ఉన్నారా అని ఆరా తీశారు. రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఎక్కడని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు పోలీసులు. వాదనల తర్వాత రైతులకు బెయిల్ ఇచ్చారు మహిళా న్యాయమూర్తి.

రాజధాని మార్చొద్దంటూ జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్న ఆరుగురు రైతులను ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి ఇళ్లకు వచ్చి మరీ వాళ్లను తీసుకెళ్లారు. దీంతో.. వెలగపూడి, వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగులంకపాలెం గ్రామాల్లో కలకలం రేగింది. సాయంత్రానికి ఆరుగురిని తెనాలి పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్టు తెలిసి.. అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలంతా తరలివెళ్లారు. స్థానిక PS కూడా కాకుండా సబ్ డివిజన్ పరిధిలోకి రాని తెనాలి తీసుకెళ్లి అక్కడ రైతుల్ని నిర్బంధించడం విమర్శలకు తావిచ్చింది. తళ్లూరు PSలో రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడంపై కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. చివరికి ఈ ఉద్రిక్తతల మధ్యే రాత్రి మంగళగిరిలో న్యాయమూర్తి ముందు రైతుల్ని హాజరుపరిచారు. ఆదివారం కావడంతో రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి.. జడ్జి నివాసానికే తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టడంతో సెక్షన్లు మార్చారు.

సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో.. ఆరుగురికి బెయిల్ మంజూరైంది. మరికాసేపట్లో ఈ ప్రక్రియ అంతా పూర్తై.. మోదుగులలంకపాలెంకు చెందిన నాగరాజు, నరేష్ బయటకు రానున్నారు. అలాగే వెంకటపాలెంకు చెందిన సురేంద్ర, శ్రీనివాసరావు.. నెక్కల్లుకు చెందిన నరసింహస్వామి, వెలగపూడికి చెందిన లోకనాయక్ విడుదల కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story