అమరావతిలో పర్యటించనున్న జనసేనాని

అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పర్యటించనున్నారు. రైతులు, ప్రజలను కలిసి ఆయన ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
కేవలం రాజధానిపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. గత 13 రోజులుగా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు.. మూడు రాజధానులపై విభన్న వర్గాల నుంచి వస్తున్న వాదనపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు వారాల నుంచి రాజధాని ప్రాంతలో ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించాలని జనసేన నిర్ణయించింది.
అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ఒకరికి న్యాయం చేసి, ఇంకొకరికి అన్యాయం జరగాలని ఎవరూ కోరుకోకూడదన్నారు. 3 రాజధానుల అంశంపై జరుగుతున్న చర్చ అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, ఇలాంటి సమయంలోఅందరం ఒక అవగాహనకు రావాలని అన్నారు. జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు.
ఇప్పటికే అమరావతిలో పర్యటించిన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేశారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై అధినేత పవన్‌కు 20 పేజీల నివేదిక అందజేశారు. ఈ నివేదికపై పార్టీ నేతలతో చర్చించిన పవన్ రాజధాని రైతులకు సంఘీభావం తెలపాలని నిర్ణయించారు.