విశాఖ ఉత్సవ్‌కు సడన్ సర్‌ప్రైజ్‌గా వచ్చిన సినీ హీరో
విశాఖ ఉత్సవ్‌కు సడన్ సర్‌ప్రైజ్‌గా వచ్చారు హీరో వెంకటేష్.. ఇక ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తోపాటు పలువురు నేపథ్య గాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారుల ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆట సందీప్ టీమ్, ఎంజే 5 టీమ్‌ల డాన్స్ పెర్‌ఫార్మెన్సులు అందరినీ ఉర్రూతలూగించాయి. దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన ఫుట్ జగ్లింగ్, ఫుట్ ఆర్చరీ విన్యాసాలు ప్రేక్షకులకు ఆశ్చర్యంతోపాటు ఆనందాన్ని అందించాయి.
తనకు విశాఖ హోమ్‌టౌన్ లాంటిదన్నారు హీరో వెంకటేష్. ఈ బీచ్ చూస్తుంటే తనకు మల్లీశ్వరి సినిమా గుర్తుకువస్తుందని అన్నారు. విశాఖ ఉత్సవ్‌కు అశేషంగా వచ్చిన విశాఖవాసులను చూస్తుంటే సముద్రం పక్కన మరో సముద్రంలా కనిపిస్తోందన్నారు. సంప్రదాయాలను కాపాడుతున్న విశాఖ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడవాళ్లకు రక్షణగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు వెంకటేష్.
మరోవైపు మహిళల రక్షణకోసం బిగ్‌థింక్ ఏర్పాటు చేసిన పరికరాన్ని వేడుకల్లో ప్రదర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విశాఖ ఉత్సవ్ విజయవంతం కావడానికి సహకరించిన అధికారులు, కళాకారులను మంత్రి అవంతి శ్రీనివాస్ శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఇక విశాఖ ఉత్సవాల్లో భాగంగా సెంట్రల్ పార్కులో ఏర్పాటుచేసిన ఫ్లవర్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశ విదేశాలకు చెందిన పుష్పాలను ప్రదర్శనకు ఉంచారు. అందమైన కళాకృతులను తీర్చిదిద్దారు. ఫ్లవర్‌షోను తిలకించేందుకు జనం పోటెత్తారు.