రాజధాని మార్చాల్సి వస్తే మళ్లీ ప్రజా తీర్పు కోరాలి - చంద్రబాబు

రాజధాని మార్చాల్సి వస్తే మళ్లీ ప్రజా తీర్పు కోరాలి - చంద్రబాబు

chandrababu

రాజధాని ప్రాంత రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు చంద్రబాబు. గుంటూరు సబ్‌జైల్లో ఉన్న అమరావతి రైతులను పరామర్శించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అమరావతి కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతుల్ని అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టులతో బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాజధాని పేరుతో మూడు ప్రాంతాల్లోనూ ప్రభుత్వం తగువులు పెడుతుందని చంద్రబాబు ఆరోపించారు. పరిపాలన చేతకాక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో రాజధానిని ఇక్కడే కొనసాగుతుందని వైసీపీ ప్రకటించిందని.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్చాల్సి వస్తే మళ్లీ ప్రజా తీర్పు కోరాలని అన్నారు చంద్రబాబు.

రాజధానిలో కుల ప్రభావం అధికంగా ఉందంటూ వైసీపీ చేసిన ప్రచారాన్ని చంద్రబాబు తిప్పి కొట్టారు. అమరావతి పరిధిలో 5 ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయని.. అక్కడ వైసీపీనే గెలిచిందని గుర్తు చేశారు. పిచ్చి తుగ్లక్‌ మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. రాజధానిని మార్చే అధికారం జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు చంద్రబాబు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు పెట్టడమేంటన్నారు చంద్రబాబు. ఒక రాజధానికే డబ్బులు లేవన్న జగన్.. మూడు రాజధానులు పెడతారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు రేపు రాజధానిలో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అమరావతిలో పర్యటించి రైతుల పోరాటానికి సంఘీభావం తెలపనున్నారు.

Tags

Next Story