న్యూఇయర్ వేడుకలకు ముస్తాబయిన సాగరతీరం

న్యూఇయర్ వేడుకలకు సాగరతీరం ముస్తాబవుతోంది. భిన్న సంస్కృతులకు నెలవైన విశాఖపట్నంలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కేలండర్‌లో చివరి రోజున.. చీకటి పడుతున్నకొద్దీ యువత కేరింతలు సాగర హోరుతో పోటీ పడుతుంటాయి. అన్ని వయసుల వాళ్లు సంబరాల్లో మునిగినా.. ఆకాశమే హద్దుగా యూత్ సెలబ్రేషన్స్ సాగుతాయి.
విశాఖపట్నంలో కొత్త ఏడాది వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చే అడ్డా బీచ్ రోడ్డు. అక్కడ సందడే సందడి. పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడ సంబరాల్ని చూసేందుకు వస్తుంటారు. డిశంబర్ 31 సాయంత్రానికే విశాఖ చేరుకుంటారు. రాత్రి మొదలైనప్పటి నుంచి అర్ధరాతి, తెల్లవారే వరకు న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు.
సాగరతీరంలోని హోటళ్లలో కనిపించే హడావుడి అంతా ఇంతా కాదు. డీజే శబ్దాలు, మెరుపు దీపాల వెలుగుల్లో యూత్ మత్తెక్కిపోతారు. అర్ధరాత్రి ఆన్‌డాట్ కాగానే కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వాళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆనంద డోలికల్లో తేలిపోతారు. వారి టేస్టుకు తగినట్టు హోటల్ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేశారు. గతేడాది కంటే ఎక్కువ కిక్కు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మరోవైపు.. న్యూఇయర్ వేడుకల పేరుతో ఫుల్లుగా మద్యం సేవించి.. రోడ్డెక్కే మందుబాబులకు ముకుతాడు వేస్తున్నారు విశాఖ పోలీసులు. బీచ్‌రోడ్‌లో వుడా పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని ప్రకటించారు. దీనివల్ల బీచ్‌రోడ్‌లో ప్రమాదాలు నివారించడంతో పాటు.. ఎక్కువ మంది పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేసే వీలు కలుగుతుందని పోలీసులు చెప్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com