రైతు కన్నీరు పెడితే ఏ ప్రాంతమూ బాగుపడదు: పవన్

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు పోరాటం అపవద్దని సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన మందడంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యమం చేస్తున్న అన్నదాతలకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసులు అడ్డంకులు సృష్టించినా.. దాటుకుని వచ్చానని చెప్పారాయన. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని పవన్ స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర నాయకులు కూడా అమరావతి రైతులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో అన్ని ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని పవన్ విమర్శించారు. రైతు కన్నీరు పెడితే ఏ ప్రాంతం బాగుపడదన్నారు. అమరావతి రైతుల పోరాటంలో తాను భాగస్వామిని అవుతానన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు, మదనపల్లె టమాటా రైతుల తరఫున జనసేన పోరాడిందని పవన్ గుర్తు చేశారు. అమరావతిలో పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న ప్రతి ఒక్కరి చెంప మీద కొట్టేలా బలమైన సమాధానం ఇస్తామని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో 100 ఎకరాలకే తీవ్రస్థాయిలో పోరాటం జరిగిందని పవన్ గుర్తుచేశారు. అలాంటప్పుడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హద్దులు చెరిపేసిన తర్వాత భూములు తిరిగి ఇచ్చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. రైతులకు న్యాయం జరక్కుండా సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేసేందుకు వీల్లేదన్నారు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి రైతుల్ని అరెస్ట్ చేయడాన్ని పవన్ తప్పుపట్టారు.
మందడం నుంచి తుళ్లూరు వెళ్లిన పవన్ కళ్యాణ్.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికనుంచి మాట్లాడారు. మీకు నేనున్నానంటూ రైతులకు ధైర్యం చెప్పారాయన. ప్రభుత్వం దిగొచ్చేదాక పోరాటం ఆగదని స్పష్టంచేశారు.