రైతులకు భరోసా ఇవ్వనున్న జనసేన అధినేత

రైతులకు భరోసా ఇవ్వనున్న జనసేన అధినేత

pawan-kalyan

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మూడు రాజధానులు, రాష్ట్రంలో ప్రభుత్వం పాలన, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాల పై చర్చించారు. ముఖ్యంగా మూడు రాజధానులపై విభిన్న వర్గాల నుంచి వస్తున్న వాదనపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతికి భూములిచ్చి.. ప్రస్తుతం గందరగోళంలో పడిపోయిన రైతులకు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించిన పవన్‌ కల్యాణ్‌.. మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని గ్రామాల రైతులను కలిసి వారికి భరోసా కల్పించనున్నారు.

ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రాజధాని ఎక్కడున్న ఒక్క చోటే ఉండాలని.. అభివృద్ధి మాత్రం అంతటా ఉండాలని అన్నారు. ప్రాంతీయ విభేదాల వల్ల రాష్ట్రాలు విడిపోయే ప్రమాదం ఉందని.. విభజన తాలూకా జబ్బు ఇంకా మనల్ని వదిలి పోలేదని గుర్తు చేశారు పవన్‌.

జగన్‌ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రా అని పవన్‌ ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా మీకు ఇష్టం లేకపోతే ధైర్యంగా ఒక రాజధానినే ప్రకటించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఎంతో కొంత ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా లేదన్నారు. రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు చేతికొచ్చిన పంటని కూడా వదిలేశారని.. రైతు కన్నీరు పెడితే అది మంచిది కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

అమరావతి రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పవన్‌. వైసీపీ ప్రవేశ పెట్టిన నవరత్నాలు అమలు చెయలేకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకోచ్చారని విమర్శించారు. భూములు ఇచ్చిన రైతులను రోడ్డు మీదకు లాగారని మండిపడ్డారు. ప్రభుత్వం, పాలకులు మారవచ్చు కానీ.. విధానాలు మారకూడదన్నారు.

మంగళవారం ఎర్రబాలెం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో పర్యటించనున్న పవన్‌.. రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రైతులకు మద్దతుగా పార్టీ తరపున పోరాడేందుకు కార్యాచరణ ప్రకటించనున్నారు.

Tags

Next Story