రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు

far

అమరావతిలో ఆందోళనలు చల్లారలేదు. 3 రాజధానుల ప్రతిపాదనపై భగ్గుమంటున్న రైతులు.. 29 గ్రామాల్లోనూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు 14వ రోజుకి చేరాయి. వెలగపూడిలో మహిళలు ప్రధానికి ఉత్తరాలు రాశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ వెయ్యి మంది పోస్ట్‌కార్డులు రాసి పంపించారు.

సీఎం జగన్ సచివాలయానికి రావడంతో మందడంలో అడుగడుగునా పోలీసు ఆంక్షలు విధించారు. షాపులన్నింటినీ మూయించారు. ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే వరకూ ఆంక్షలు కొనసాగించారు. ప్రభుత్వ తీరుపై రైతులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిద్ధార్ధ వాకర్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇబ్రహీంపట్నం గొల్లపూడిలో 24 గంటల దీక్ష చేపట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ. రాజధాని విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు హోరెత్తుతున్నాయి. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు.వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రాజధాని కోసం పచ్చని భూముల్ని త్యాగం చేసిన రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

అనంతపురం జిల్లా కదిరిలో అఖిలపక్షం నేతలు చెవిలో పూలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ర్యాలీగా వెళ్లి టవర్ క్లాక్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు.

Tags

Next Story