విజయవాడలో క్యాండిల్ ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

సేవ్ అమరావతి పేరుతో ఏపీలో ఉద్యమం ఊపందుకుంటోంది. నిన్న మొన్నటి వరకు రాజధాని గ్రామాలకే పరిమితమైన ఆందోళనలు పక్క జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. రాజధాని మార్పుకు వ్యతిరేకంగా జనం నినదిస్తున్నారు. అటు గత 13 రోజులుగా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నా, దీక్షలు కొనసాగిస్తున్నారు. వాంటా వార్పులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం రాత్రి అరెస్టైన ఆరుగురు రైతులు బెయిల్‌పై విడుదలయ్యారు. వారికి రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. కేసులతో తమను భయపెట్టలేరని రాజధాని ప్రాంత రైతులు స్పష్టంచేశారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వారిపై అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం దారుణమన్నారు. కేపిటల్‌ను అమరావతి నుంచి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
అటు కృష్ణా జిల్లాలో సేవ్ అమరావతి ఉద్యమం ఊపందుకుంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే అరెస్ట్ చేస్తారా అని మహిళలు మండిపడ్డారు.
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమైనదని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ప్రతి రోజు నిరసన దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.
రాజధానిని, హైకోర్టును అమరావతిలోనే కొనసాంచాలని బెజవాడ బార్ అసోసియేషన్ ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. 13 జిల్లాలకు అనువైన ప్రాంతమైన అమరావతి నుండి హైకోర్టును, రాజధానిని తరలించడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం కూడా మహాధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు రైతులు. విపక్ష నేతలు అమరావతిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు.