మిరుమిట్లు గొలిపే వెలుగులు, కళ్లు జిగేల్మనే బాణాసంచాతో కొత్త సంవత్సరానికి స్వాగతం

మిరుమిట్లు గొలిపే వెలుగులు, కళ్లు జిగేల్మనే బాణాసంచాతో కొత్త సంవత్సరానికి స్వాగతం

న్యూ ఇయర్‌కు ప్రపంచం సాదరంగా స్వాగతం పలికింది. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త ఏడాదిని ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే వెలుగులు, కళ్లు జిగేల్మనే బాణాసంచా మెరుపులు, డ్యాన్సులు, పార్టీలతో ప్రజలు హోరెత్తించారు.

భూమిపై న్యూ ఇయర్ వేడుకలు మొదట జరుపుకున్నది సమోవా. సుమారు 2 లక్షల జనాభా ఉన్న సమోవా, మనదేశం కంటే ఎనిమిదిన్నర గంటల ముందుగానే కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పింది. క్రిబా టీలోని క్రిస్మస్ ద్వీపంలోనూ మనదేశం కంటే ఎనిమిదిన్నర గంటల ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి.

సమోవా, కిరీట్‌మటి, క్రిబాటీల తర్వాత కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ స్వాగతం పలికింది. ఆక్లండ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. నూతన సంవత్సర ఉత్సవాలను వీక్షించేందుకు వేలాదిమంది పర్యాటకులు ఆక్లండ్‌కు తరలివచ్చారు.

బాణాసంచా పేలుళ్లు, విద్యుత్ వెలుగులతో న్యూజిలాండ్‌ హోరెత్తిపోయింది. రంగురంగుల కాంతులు వెదజల్లుతూ సాగిన బాణాసంచా పేలుళ్లు పర్యాటకులకు కనువిందు చేశాయి. సంగీత హోరు, ఆనందోత్సాహాల నడుమ ప్రజలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆనందించారు.

న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా వంతు. సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదరగొట్టాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సందడి చేశారు. సిడ్నీలో జరిగిన క్రాకర్స్ షో పర్యాటకులను కట్టిపడేసింది.

దక్షిణ కొరియాలో కొత్త సంవత్సర వేడుకలు దుమ్ము రేపాయి. సియోల్ వాసులు న్యూ ఇయర్‌కు సాదరంగా వెల్కమ్ చెప్పారు. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో రెస్టారెంట్‌లు, పబ్‌లు, బార్‌లు సందడిగా మారాయి.

జపాన్ లోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. రాజధాని టోక్యోలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో టూరిస్టులు రెట్టించిన ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు.

హాంకాంగ్‌లోనూ కొత్త సంవత్సర వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. వెలుగు జిలుగులతో పలు ఐకానిక్‌ భవనాలు కలర్‌ఫుల్‌గా మారాయి. విక్టోరియా హార్బర్‌లో ఏర్పాటు చేసిన లేజర్‌ షోలు, బాణసంచా మెరుపులు ఆకట్టుకున్నాయి.

థాయ్‌లాండ్‌లోనూ వైభవంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. చావో ప్రాయ నది తీరం బాణసంచా వెలుగులతో కలకలలాడింది. లేజర్‌ షోలు కొత్త అందాలను తీసుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story