మందుబాబులా మజాకా.. న్యూ ఇయర్‌కి మత్తులో మునిగి తేలారుగా!

మందుబాబులా మజాకా.. న్యూ ఇయర్‌కి మత్తులో మునిగి తేలారుగా!

drinker

నూతన సంవత్సర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ యువత మద్యం మత్తులో మునిగితేలింది. న్యూ ఇయర్‌ వేడుకల పేరుతో రెట్టింపు శాతం మద్యం పొంగిపొర్లింది. 92 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని ఒక్క మంగళవారం రోజే తాగేశారు. సాధారణంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో రోజుకు సగటున 50 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సర వేడుకలతో డిసెంబరు 31న దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి.

ఏటా డిసెంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకూ, బార్లకు రాత్రి 1 గంట వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ ఏడాది అలాంటి అనుమతులేమి ఇవ్వలేదు. ప్రతి రోజూలాగే రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు, 10 గంటలకే బార్లు మూతపడ్డాయి. అయినప్పటికీ అమ్ముడైన మద్యం విలువ మాత్రం తగ్గలేదు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా పరిధిలో ఎక్కువ విక్రయాలు సాగాయి.

ఏపీ వ్యాప్తంగా డిసెంబరు 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ మద్యం తాగి వాహనాలు నడుపుతూ 794 మంది పట్టుబడ్డారు. అత్యధికంగా విశాఖపట్నం నగర కమిషనరేట్‌ పరిధిలో 287 మంది, గుంటూరు అర్బన్‌లో 83 మంది, విజయనగరం జిల్లాలో 78 మంది పట్టుబడ్డారు. గుంటూరు గ్రామీణ, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో ఒక్కరూ చిక్కలేదు.

మద్యం తాగుతూ వాహనాలు నడపటం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల మధ్య 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు. మొత్తం 30 ప్రమాదాలు చోటుచేసుకోగా.. 30 మంది గాయపడినట్టు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story