అమరావతి రైతులకు మద్దతుగా మిన్నంటుతున్న ఆందోళనలు
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... వరుసగా 16 రోజు కూడా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో... పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర సంఘాలు పాల్గొంటున్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజు నిరసనలు చేపట్టారు. అమరావతిలో రాజధాని కొనసాగించాలని అందరూ డిమాండ్ చేశారు. అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్నారు జేఏసీ నేతలు.
రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాలంటున్నారు అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో.. టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన నేతలు పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ.. రాజధానిని మార్చవద్దంటూ నినాదాలు చేశారు.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళనలు చేస్తున్న రాజధాని రైతులకు మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బాలాజీ గుప్తా, ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు పోతినేని శ్రీనివాస్‌తోపాటు పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
రాజధాని కోర్ ఏరియాలోని మందడంలోనూ.. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి తరలింపును దేవుడే అడ్డుకోవాలంట మహిళలు ప్రార్థనలుచేశారు. మందడం ధర్నా టెంట్‌లో గోవింద నామాలు, లలితా సహస్ర నామాలు పారాయణం చేశారు మహిళలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com