తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు చలి.. మరోవైపు వానలు..
తెలుగు రాష్ట్రాలను ఓ వైపు చలి వణుకుపుట్టిస్తుంటే.. మరోవైపు వానలు పలకరిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో గత రెండ్రోజులుగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో గ్రేటర్ తడిసిముద్దయింది. నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఉప్పల్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉప్పల్, హబ్సిగూడలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. మరో రెండ్రోజులపాటు ఇదే పరిస్థితి ఉండనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో బంగాళాఖాతం నుంచి కోస్తా, తెలంగాణపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో వర్ష ప్రభావం ఎక్కువకగా ఉంది. ఇవాళ, రేపు రెండు రోజులు పాటు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీన్నిబట్టి చూస్తే.. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. హైద్రాబాద్‌లో వాన ముసురుపట్టనున్నట్టు తెలుస్తుంది. ఈశాన్యం నుంచి వీచే చలి గాలులు ఆలస్యంగా రావడంతో.. చాలా రోజులపాటు చలి తక్కువగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. చిలకలూరిపేటలో రెండు, శ్రీకాళహస్తిలో ఒక సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ దిశనుంచి వీస్తున్నగాలుల వల్ల రాష్ట్రంలోని చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగాయని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com