- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- రణరంగంగా అమరావతి.. రాజధాని రైతుల...
రణరంగంగా అమరావతి.. రాజధాని రైతుల ఉగ్రరూపం

అమరావతి రణరంగంగా మారింది. రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆందోళనలు, నిరసనలకే పరిమితమైన రైతులు ఇక సకల జనుల సమ్మెతో కదం తొక్కుతున్నారు. రహదారిపై టెంట్‌లు వేసి మహాధర్నాలు చేపడుతున్నారు. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దంటూ నినాదాలతో హొరెత్తిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
ఒకటి రెండు కాదు.. సుమారు 17 రోజులుగా రోడ్డుపైనా ఉంటున్నారు రాజధాని రైతులు.. రిలేదీక్షలు, ర్యాలీ, ధర్నాలతో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేస్తున్నారు. దీంతో ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. వెలగపూడి, మల్కాపురం గ్రామాలకు చెందిన 15 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగని పోలీసులు.. మందడంలో ధర్నా చేస్తున్న మహిళలు, రైతులపై జులుం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని బలవంతగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొందరిపై దాడి చేసి మరి వాహనాల్లో ఎక్కించారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డంగా ఆందోళనకారులు పడుకున్నారు. పోలీసు వాహనం టైరు ఓ రైతు చేయిపైకి ఎక్కడంతో గాయాలయ్యాయి. పోలీసులు తమ గొంతు నులిమారని పలువురు ఆరోపించారు. పోలీసుల తీరుపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..
ప్రభుత్వం వెంటనే దిగి రాకుంటే ఆత్మహత్యలకు సైతం వెనుకాడబోమని రాజధాని రైతులు హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వని ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీల్లేదంటూ గర్జించారు. పరిపాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని.. ఇలాంటి ప్రభుత్వం ఉండడం కంటే.. రాష్ట్రపతి పాలనే నయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఓట్లు వేసి గెలిపించిన తమను ఇలా రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పక తప్పదని మహిళలు హెచ్చరించారు. పోలీసుల దమనకాండను ఖండిస్తూ రాజధాని రైతులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు..
రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై మీ ప్రతాపం చూపించడం దారుణం జగన్ గారూ అంటూ... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇచ్చిన మాటపై నిలబడండి... మడమ తిప్పకండని అక్కాచెల్లెళ్లు అడగటం తప్పా అని ట్విట్టర్‌లో లోకేష్ ప్రశ్నించారు.
ఏపీ రాజధానిలో మహిళ నిరసనకారులపై పోలీసుల దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అటు మహిళపై పోలీసుల తీరును సోషల్ మీడియాలో చూసిన జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇష్యూను సుమోటోగా తీసుకుని విచారణ జరిపిస్తామన్నారు కమిషనర్ రేఖా శర్మ..
అమరావతి రైతుల ఆందోళనలు ఏపీ వ్యాప్తంగా పాకుతున్నాయి. అమరావతిలో హైకోర్టును కొనసాగించాలని న్యాయవాదులు ఆందోళనలు చేశారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టుముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 6 వ తేదీన విద్యార్ధి జేయేసీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. 7 వ తేదీన హైవే దిగ్బంధం, 9న నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు.
రాజధానిపై సీఎం జగన్ తీరును నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆంధ్రరత్న భవన్ వద్ద ధర్నా చేపట్టారు. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్, హైపవర్ కమిటీ జీవో ప్రతులను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.
గుంటూరులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంటిని అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ముట్టడించారు. ఎంపీ ముందు కూర్చొని.. సేవ్ అమరావతి... సేవ్ ఆంధప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సేవ్ అమరావతి- సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com