రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న సేవ్ అమరావతి నిరసనలు
రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందే అంటూ రోజు రోజుకు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయే తప్ప ఆగడం లేదు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసుల ఆంక్షలు, వేధింపులతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. జేఏసీ పిలుపుతో రోజంతా అమరావతి బంద్ కొనసాగింది. మందడంలో మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి రైతులు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బీసీజీ కమిటీ నివేదికపై రైతులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల మోకాళ్లపై కూర్చొని రైతులు నిరసన చేశారు. మరికొన్ని చోట్ల భారీగా చేరిన రైతులు ర్యాలీ నిర్వహించారు. మహిళలంతా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు రైతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి తలుపులు తడుతున్నారని.. గోడలు దూకి ఇళ్లలోకి వస్తున్నారని మహిళలు వాపోతున్నారు. వాళ్లకు ఆ హక్కు ఎవరిచ్చారని నిలదీస్తున్నారు. భయపెట్టి తమ ఉద్యమాన్ని అణిచివేయలేరని మహిళలు హెచ్చరిస్తున్నారు.
రాజధాని మార్పు మనస్తాపంతో ఓ రైతు గుండెపోటుతో మరణించడం విషాదాన్ని మిగిల్చింది. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని తరలిపోతుందనే మనోవేదనతోనే ఆయన చనిపోయాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంటున్నారు. మల్లికార్జున రావు మృతికి సంతాపంగా తుళ్లూరు మహాధర్నా కార్యక్రమంలో రైతులు రెండు నిముషాలు మౌనం పాటించారు. రైతు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
రైతుల ఆందోళనలకు విపక్షాలు, వివిధ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జంధ్యాల రవిశంకర్ రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగిన అమరావతిని తరలించడాన్ని హిందూ మహాసభ ఒప్పుకోదన్నారు. అమరావతి పరిణామాలపై మా అధినాయకత్వం ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు.
అటు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడ లెనిన్ సెంటర్‌లో దీక్షలు చేపట్టారు. వివిధ ప్రజా సంఘాలు, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపాయి. బోస్టన్ కమిటీ నివేదిక బూటకం అంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రాజధాని గురించి ఆందోళనలు జరుగుతుంటే సినిమా వాళ్లు ఎందుకు స్పందించరని అమరావతి పరిరక్షణ సమితి నేతలు నిలదీశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన అఖిలపక్షం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కాల్వ శ్రీనివాసులును అరెస్ట్ చేసి సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజధానిపై మంత్రి బొత్సను నిలదీశారు టీడీపీ నేతలు. రాజధాని వ్యవహారాన్ని వెంటనే తేల్చాలని బొత్స కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్. దీంతో పోలీసులు పీఆర్ మోహన్‌ను పక్కకు తోసేశారు. ఉద్రిక్తత ఏర్పడింది.
సేవ్ అమరావతి పేరుతో కృష్ణా, గుంటూరుతో పాటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. మూడు రాజధానులతో రాష్ట్రం నష్టపోతుందని అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com