ఏపీ రాజధాని భవితవ్యంపై మరో కీలక నివేదిక
జీఎన్ రావు రిపోర్ట్ తర్వాత ఏపీ రాజధాని భవితవ్యంపై మరో కీలక నివేదిక ప్రభుత్వం చేతికి అందింది. ఏపీ రాజధానితో పాటు సమగ్ర అభివృద్ధి అకాశాలపై స్టడీ చేసిన బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ రాజధాని ప్రాంతంపై పలు కీలక సిఫార్సులను చేస్తూ రిపోర్ట్ ను సీఎం జగన్ కు సమర్పించారు. అమరావతిని అభివృద్ధి చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని బీసీజీ కమిటీ అభిప్రాయపడింది. ఒక నగరానికి అంత ఖర్చు చేయడం రిస్క్‌తో కూడిన పని కమిటీ స్పష్టం చేసింది. మొత్తంగా ఏపీని ఆరు ప్రాంతాలు, మూడు రాజధానులుగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నది కమిటీ సూచన. రాష్ట్రంలో 13 జిల్లాలు ఆరు ప్రాంతాలుగా విభజన చేయాలన్న కమిటీ..ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, గోదావరి డెల్టాలోని రెండు జిల్లాలు, కష్ణా డెల్టా 2 జిల్లాలు, దక్షిణాంధ్రలో ప్రకాశం, నెల్లూరు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఇలా ఆరు ప్రాంతాలుగా విభజించారు.
ఇక రాజధానుల విషయానికి వస్తే ప్రభుత్వం తలచిందే కమిటీ సూచించింది. ఒకే చోట నగరం అభివృద్ధితో ప్రయోజనం తక్కువేనని అబిప్రాయపడిన బీసీజీ కమిటీ..రాజధానులలో విశాఖకు మొదటి ప్రధాన్యం కల్పించింది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటీవ్, జ్యూడిషయల్ వ్యవస్థలు మొదటి ప్రధాన్య నగరంలోనే ఉండాలన్నది కమిటీ సూచన. అదే సమయంలో రాజధానుల సెలక్షన్స్ లో రెండు అప్షన్లను కూడా సూచించింది కమిటీ.
విశాఖపట్నంలో గవర్నర్, సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖలు, టూరిజం శాఖ ఏర్పాటు చేయాలని సూచించింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌తో పాటు మూడు ఎడ్యుకేషన్ హెచ్‌ఓడీ ఆఫీసులు, నాలుగు అగ్రికల్చర్ హెచ్‌ఓడీ ఆఫీసులు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఇక కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థల ఏర్పాటు చేయాలని సూచించింది.
విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్ – సీఎం క్యాంప్ ఆఫీస్, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషనర్ ఆఫీసులు, అప్పిలేట్ సంస్థలను ఏర్పాటు చేయాని కమిషన్ సిఫార్సు చేసినట్లు ప్లానింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆర్ధిక వనరులపై అధ్యయనం చేసిన కమిటీ..ఒక్క అమరావతి నగరంపై లక్షకోట్ల రూపాయలు ఖర్చుపెడితే.. 40 ఏళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం అంత ఖర్చు భరించే స్థితిలో ఏపీ లేదని.. ఏపీకి ఉన్న పరిమిత వనరులు అమరావతిపై కేంద్రీకరిస్తే సాధించేది ఏమీ ఉండదని కమిటీ స్పష్టం చేసింది. అమరావతికి ఖర్చుపెట్టాల్సిన లక్ష కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడితే.. ఐదేళ్లలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని కమీటీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్‌కు 2లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇబ్బందిగా ఉందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. వ్యవసాయం విషయంలోనూ చాలా అసమతుల్యత ఉన్నట్లు చెప్పారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న విజయ్‌కుమార్. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్ కనెక్టివిటీ ఉందన్నారు. విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఉన్నాయని, అలాగే విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి చెంది ఉన్నాయని కమిటీ పేర్కొందారు.. 8 జిల్లాల్లో పారిశ్రామిక వృద్ధి చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. అలాగే తలసరి ఆదాయంలో ఏపీ చాలా వెనుకబడి ఉందన్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి తక్కువ ఉన్నట్లు వివరించారు.
విశాఖలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని బోస్టన్ కమిటీ చెప్పిందని ప్లానింగ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. విశాఖలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని వెల్లడించారు. విజయవాడలాంటి చోట్ల 10 లక్షలమంది జనాభా ఉన్నా.. మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మూడు ప్రాంతాల్లోనూ విశాఖ, విజయవాడ, కర్నూలును ప్రధానంగా భావించి దృష్టి సారించాలని బీసీజీ సూచించిందని పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com