అమరావతిలో మహిళలపై పోలీసుల దౌర్జన్య కాండ

అమరావతిలో మహిళలపై పోలీసుల దౌర్జన్య కాండ

amaravati-issue

మందడంలో మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. మరోవైపు పోలీసుల ఓవరాక్షన్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల బాధల్ని పట్టించుకోని ప్రభుత్వం తమకు వద్దంటూ నినదించాయి. ఇక మందడం ఘటనపై టీడీపీ NHRCకి ఫిర్యాదు చేసింది.

అమరావతి పూర్తి రణరంగాన్ని తలపిస్తోంది. నిన్నటి వరకు ఆందోళనలు, నిరసనలకే పరిమితమైన రైతులు ఇప్పుడు సకల జనుల సమ్మెతో కదం తొక్కారు. ఆందోళన కారులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని బలవంతగా అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. కొందరిపై దాడి చేసి మరి వాహనాల్లో ఎక్కించారు. దీంతో మందడంలో మహాధర్నా తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనలలో పాల్గొన్న మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డంగా ఆందోళనకారులు పడుకున్నారు. పోలీసు వాహనం టైరు ఓ రైతు చేయిపైకి ఎక్కడంతో గాయాలయ్యాయి. పోలీసుల చర్యపై మందడం వాసులు భగ్గుమన్నారు. మహిళలను పోలీసు వ్యానులోకి ఎక్కించే క్రమంలో తోపులాట జరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తమ గొంతు నులిమారని పలువురు ఆరోపించారు. అదే సమయంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆమెను 108లో తరలించాలని పోలీసులు ప్రయత్నించగా.. మహిళలు పోలీసుల సాయాన్ని నిరాకరించారు. ప్రైవేటు వాహనంలోనే మహిళను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దమనకాండను ఖండిస్తూ రాజధాని రైతులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు.

అమరావతిలో పోలీసుల దౌర్జన్య కాండపై మహిళలు నిప్పులు చెరిగారు. న్యాయం కోసం పోరాడుతుంటే ప్రభుత్వం తమపై జులుం చేస్తుందా అంటూ మండిపడ్డారు. ప్రజల మనోభావాలు పట్టని ప్రభుత్వం తమకు అవసరం లేదంటూ తేల్చిచెప్పారు.

రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసు జులుం ప్రదర్శించడాన్ని టీడీపీ సీరియస్‌ తీసుకుంది. జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోదళనలపై పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మనవహక్కుల కమిషన్‌ను ఆయన కోరారు.

మరోవైపు... అమరావతిలో మహిళలపై జరిగిన దౌర్జన్యకాండపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. బొప్పన ప్రతిభ అనే మహిళ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టుపై స్పందించిన కమిషన్‌ ఛైర్‌పర్సన్‌‌ రేఖా శర్మ.. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story