రాజధాని అంశంపై భగ్గుమంటున్న సీమవాసులు

రాజధాని అంశంపై భగ్గుమంటున్న సీమవాసులు

rayalaseema

రాజధాని అంశంపై రాయలసీమ వాసుల్ని ఎవర్ని కదిల్చినా భగ్గుమంటున్నారు. గతంలో రాజధానిని పోగొట్టుకున్న తమకు మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీమ ప్రజలు, నేతలు మండిపడుతున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ అంటూ ప్రభుత్వం ఫిక్స్ అవడంతో.. సీమ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమరావతి అయినా.. అందరికీ అందుబాటు ఉంటుందనుకుంటే.. ఇప్పుడు ఇలా చేస్తున్నారేంటని ప్రశ్నిస్తున్నారు. ఉంటే అమరావతి లేదా కర్నూల్‌ను పూర్తిస్థాయి రాజధాని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కర్నూల్‌ను జ్యుడీషియల్‌ కేపిటల్‌ చేస్తే ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు సీమవాసులు. ఉన్న రాజధానిని కదిలించి రైతులను రోడ్డుపడేశారంటున్నారు. రాజధానిని ముక్కలుగా చేయడం దారుణమన్నారు బీజేపీ నేత టీజీ వెంకటేశ్‌. అన్ని ఒక చోట ఉన్నపుడే దాన్ని రాజధాని అంటారు. కాని... ఇలా ముక్కలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మూడు రాజధానుల వల్ల ఏ మాత్రం లాభంలేదన్నారు. పరిపాలన, అసెంబ్లీ, కోర్టులతో కూడిన రెండో రాజధాని మాకు ఇవ్వాలన్నారు టీజీ వెంకటేశ్‌.

అసలు జ్యుడీషియల్‌ కేపిటల్ అంటే ఏంటి.. దీనివల్ల రాయలసీమకు ఏం లాభం జరుగుతుందని సీమవాసులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌ అనుభవరాహిత్యం వల్లనే.. ఇలాంటివి జరుగుతున్నాయన్నారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి. మూడు రాజధానుల కాన్సెప్ట్ అబద్ధమన్నారు బైరెడ్డి. హైకోర్టు ఇస్తే రాజధాని ఇచ్చినట్టా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలి లేదా కర్నూల్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజధానిని కర్నూల్‌లో పెట్టకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి అడుగులు పడతాయని హెచ్చరిస్తున్నారు.

కేవలం మమ్మల్ని మభ్యపెట్టడానికే హైకోర్టును ఇస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. మా మధ్య గొడవలు పెట్టడానికి వేసిన ప్లాన్‌లా ఉందన్నారు. విశాఖకు తుఫాన్లు ముప్పు పొంచి ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో.. అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ ఎలా పెడతారని ప్రశ్నించారామె. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందే ప్రయత్నం జరుగుతోందన్నారు భూమా అఖిలప్రియ.

ఏపీ సర్కార్‌ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో విద్యార్థి సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని పాటించి.. కర్నూల్‌ను రాజధానిగా చేయాలని.. విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కర్నూల్‌లో పూర్తిస్థాయి రాజధాని పెట్టాలని అంటున్నారు. విశాఖకు వెళ్లాలంటే 7 వందల కిలోమీటర్లు ప్రయాణించి అవస్థలు పడాల్సి వస్తుందన్నారు విద్యార్థి నాయకులు.

Tags

Read MoreRead Less
Next Story