మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. : రైతులు
మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అనే నినాదం మారుమోగుతోంది. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతుల పోరాటం రోజు రోజుకూ ఇంకాస్త ఉగ్రరూపం దాలుస్తోంది. సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రా అంటూ రైతులు కదం తొక్కారు. ఇప్పటి వరకు నిరసనలు, ధర్నాలు, రిలే దీక్షలతో హోరెత్తించిన రైతులు.. తుళ్లూరులో మహా పాదయాత్ర చేపట్టారు. రైతుల పాదయాత్రకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వేల సంఖ్యలో ప్రజలు ర్యాలీకి తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది. మహా పాదయాత్రతో రాజధాని గ్రామాలు దద్దరిల్లాయి. పాతిక వేల మందికి పైగా రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తుళ్లూరు నుంచి వెలగపూడి మీదుగా మందడం వరకు పాదయాత్ర సాగింది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. నాడు పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు ప్రజలందరినీ రోడ్డు మీదకు ఈడ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అటు అమరావతి గ్రామాల రైతులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.. తుళ్లూరులో మొదలైన బైక్ ర్యాలీ వెలగపూడి మీదుగా మందడం వరకు కొనసాగింది.
రాజధాని అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. మందడంలో రైతుల నిరసనకు జయదేవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు.మరోవైపు రాజధానిలో మరో 10మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనల విషయంపై మాట్లాడదామని స్టేషన్‌కు పిలిచి.. వెలగపూడికి చెందిన రైతులను చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతిని కాపాడుకుందాం అంటూ జేఏసీ విజయవాడలోని ప్రసాదంపాడులో జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది.
ఏపీ రాజధాని తరలింపును అక్కడి రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. అమరావతికి పొలాలను తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మాట మారుస్తోందని మహిళలు సైతం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. కేంద్రం దృష్టికి సైతం తీసుకెళ్లగా.. ఓ మహిళ హిందీలో రాష్ట్రపతికి విన్నపం పంపింది. రాష్ట్రపతి కోవింద్‌కు అర్థమయ్యేలా తమ గోడును వెల్లబోసుకుంది. గుంటూరు జిల్లా చిలుకలూరి పేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం నుండి గణపవరం గ్రామం వరకు 20 కిలోమీటర్ల దూరం వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మ హిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. నల్ల బాడ్జీలను ధరించి దారి పొడవునా సేవ్ అమరావతి పేరుతో నినాదాలు హోరెత్తించారు.
ఇటు అమరావతి తరలింపుపై ఆందోళనలు.. నిరసనలు 20వ రోజుకి చేరాయి. సీఎం జగన్ మనసు మారాలని ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం దగ్గర ముక్కోటీ ఏకాదశి పర్వదినం రోజు.. యాగం నిర్వహించారు. అటు గుంటూరు జిల్లా పొలిటికల్ జేఏపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com