పాక్ చెర నుంచి 22 మంది తెలుగు మత్స్యకారులకు విముక్తి
పాకిస్థాన్ చెరలో ఉన్న 22 మంది తెలుగు మత్స్యకారులకు విముక్తి లభించింది. 13 నెలల తర్వాత వారిని భారత్‌కు ఆప్పగించేందుకు పాక్ ఓకే చెప్పింది. కాసేపట్లో వాఘ బోర్డర్ దగ్గర జాలర్లను భారత అధికారులకు అప్పగించనున్నారు. మత్స్యకారులను రిసీవ్ చేసుకునేందుకు మంత్రి మోపిదేవి రమణ ఇప్పటికే వాఘ బోర్డర్‌కు వెళ్లారు. తెలుగు జాలర్లను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
ఏడాది క్రితం గుజరాత్‌లోని వీరావలి ప్రాంతానికి వేటకోసం వెళ్లిన మత్స్యకారులు పాక్ కోస్టు గార్డులకు చిక్కారు. చేపలవేట సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా వీరు ఉన్న బోటు పాక్ అంతర్భాగంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి పాక్‌లోని జైళ్లలో మగ్గుతున్నారు. పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన వారిలో శ్రీకాకుళం జిల్లాలోని డి.మత్స్యలేశం, విజయనగరం జిల్లాలోని తిప్పలవలస, ముక్కాం, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మత్స్యకారులున్నారు. వీరంతా ఇప్పటిదాకా కరాచీ జైలులో ఉన్నారు.
13 నెలల పాటు మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి. తమ ఆప్తులను విడిపించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగగా.. ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి. 22 మంది జాలర్లను విడిచిపెట్టేందుకు పాక్ ఓకే చేప్పింది. కరాచీ జైలు నుంచి ప్రత్యేక భద్రత మధ్య వాఘ సరిహద్దుకు మత్స్యకారులను తరలిస్తున్నారు. రెండు దేశాల అధికారుల మధ్య ఫార్మాలిటీస్ పూర్తవగానే వారిని ఇంటికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేశారు మంత్రి మోపిదేవి. తమ వారు విడుదలవుతున్నారన్న సమాచారంతో మత్స్యకారుల గ్రామాల్లో సంతోషాలు వెల్లివిరిసాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com