మహారాష్ట్రలో ఎన్సీపీదే అప్పర్ హ్యాండ్..

ఎన్సీపీదే అప్పర్ హ్యాండ్.. ఎక్కువ మంత్రి పదవులు ఆ పార్టీకే.. కీలక శాఖలూ ఆ పార్టీకే.. అన్నింటిలోనూ ఎన్సీపీకే అగ్రతాంబూలం. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు సెకండ్, థర్డ్ ప్లేస్.. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ పరిస్థితి ఇది. ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో ఎన్సీపీకే మేజర్ వాటా. ఎక్కువ మినిస్టర్ పోస్టులను ఆ పార్టీనే తీసుకుంది. పైగా, ఆర్థికం, హోం, నీటి పారుదల, గృహ నిర్మాణం తదితర కీలక పోస్టులు కూడా ఆ పార్టీకే లభించాయి. సంఖ్యా పరంగా కూడా ఎక్కువ శాఖలు ఎన్సీపీకే దక్కాయి. ఎన్సీపీ తీసుకోగా మిగిలిన శాఖలను శివసేన, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నాయి.
మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, మంత్రులకు కేటాయించిన శాఖల జాబితాను గవర్నర్‌కు పంపించి ఆమోదముద్ర వేయించుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థికశాఖ దక్కింది. ఎన్సీపీకి చెందిన అనిల్ దేశ్‌ముఖ్‌కు హోంశాఖను కట్టబెట్టారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు పర్యాటకం, పర్యావరణ-ప్రొటోకాల్ శాఖలను అప్పగించారు. కాంగ్రెస్ నేత బాలా సాహెబ్ థోరట్‌కు రెవెన్యూ శాఖ ఇచ్చారు. శివసేన నేతలు ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్‌లకూ కీలక శాఖలు కేటాయించారు. అశోక్ చవాన్‌కు PWD, ఛగన్ భుజ్‌బల్‌కు ఆహార-పౌరసరఫరాలు, జయంత్ పాటిల్‌కు ఇరిగేషన్ శాఖ కేటాయించారు. ఎవరికీ ఇవ్వని శాఖలను ఉద్ధవ్ థాక్రేనే పర్యవేక్షించనున్నారు.
ఇదిలా ఉంటే, మంత్రి పదవులు-శాఖల కేటాయింపు మహా సంకీర్ణంలో చిచ్చు రేపుతోంది. అలకలు, అసంతృప్తి, తిరుగుబాట్లు మొదలయ్యాయి. పదవులు రాని నేతలు, ఆశించని శాఖలు దక్కని మంత్రు లు అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ రాజీనామాకు సిద్ధమయ్యారు. తనకు సహాయమంత్రి పదవి ఇవ్వడంపై అబ్దుల్ సత్తార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో ఎమ్మెల్యే అనిల్ బార్బర్ ఏకంగా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకీ మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే రాజీనామా చేశారు. జాల్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాశ్ గోరన్తియల్ కూడా పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.
గత డిసెంబర్‌లో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గ విస్తరణకు నెల రోజుల సమయం పట్టింది. ఎట్టకేలకు డిసెంబర్ చివరి వారంలో కేబినెట్ ఎక్స్‌పాన్షన్ జరిగింది. ఆ తర్వాత శాఖల కేటాయింపునకు మరో వారం రోజుల సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆ పని కూడా పూర్తి చేశారు. ఐతే, పదవుల కేటాయింపులో మూడు పార్టీల మధ్య సమానత్వం లోపించడం, మంత్రి పదవులు రాని వాళ్లలో అసంతృప్తి తదితర కారణాలతో సంకీర్ణ కూటమిలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com