- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్ల దాడి...
ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసిందెవరో అర్థం కావడం లేదు : రైతులు

అమరావతిలో 21 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా ఏ రోజూ రైతులు అదుపు తప్పలేదు. మంగళవారం చినకాకాని వద్ద హైవే ముట్టడి మాత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీనికి కారణం ఏంటి.. కొందరి వ్యూహం ప్రకారమే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాన్వాయ్‌పై దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర కోణం ఉందా అనే సందేహాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు..? రైతుల్ని బద్నాం చేయడానికి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే కొందరు ప్రయత్నించారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
మంగళవారం హైవే దిగ్భందానికి అమరావతి జేఏసీ పిలుపు ఇవ్వడంతో ఉదయం నుంచే రైతులు వేలాది మంది చినకాకానికి చేరుకున్నారు. వందల మందిని పోలసులు అరెస్టు చేసినా.. నిరసనకారులు వెల్లువలా వస్తూనే ఉన్నారు. ఈ సమయంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాన్ని ఆందోళనకారులు గుర్తించారు. MLA వాహనం ఆపి రైతుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే ఉన్నట్టుండి పరిస్థితి గందరగోళంగా మారింది. కొందరు ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఐతే.. ఈ పని చేసింది ఎవరనే దానిపై స్పష్టత లేదు. తాము వైసీపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే.. రాళ్ల దాడి చేసింది ఎవరో తమకు అర్థం కావడం లేదంటున్నారు రైతులు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com