ఆర్థికమంత్రి బుగ్గన నేతృత్వంలో హైపవర్‌ కమిటీ సమావేశం

ఆర్థికమంత్రి బుగ్గన నేతృత్వంలో హైపవర్‌ కమిటీ సమావేశం

buggana

అమరావతిని చంపేయకండి.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరం లేదంటూ ఓ వైపు ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న వేళ.. హైపవర్‌ కమిటీ సమావేశమవుతోంది. విశాఖలో పరిపాలనా రాజధాని కేంద్రంగా వడివడిగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా వాటి అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు అందటంతో ఈ రెండు నివేదికల అధ్యయనం, సిఫార్సుల పై ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థికమంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ మంగళవారం తొలిగా సమావేశమవుతుంది. రెండు కమిటీలపై లోతుగా అధ్యయనం చేసి ఈనెల 17న ముఖ్యమంత్రికి తమ నివేదిక సమర్పిస్తుంది.

హైపవర్‌ కమిటీ నివేదిక సైతం లాంఛనమే అనే ప్రచారం జరుగుతోంది. 18వ తేదీ ఉదయం ప్రత్యేక కేబినెట్‌ నిర్వహించి నివేదికకు ఆమోదం తెలపనున్నారు. అటు అధికారికంగా రాజధానులపై నిర్ణయానికి ఆమోద ముద్ర కోసం ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క రోజు సమావేశంలోనే ఈ అంశంపై చర్చించి అధికారికంగా మూడు రాజధానులపై తీర్మానం చేసి ఆమోద ముద్ర వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

జీఎన్‌రావు కమిటీ నివేదిక, బీసీజీ రిపోర్ట్‌ ఇంచు మించు ఒకే రకంగా ఉన్నాయి. మూడు రాజధానులకే ఓటు వేశాయి. బీసీజీ రెండు ఆప్షన్లు సిఫార్సు చేసింది. విశాఖలో గవర్నర్, సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌, ప్రభుత్వ ఆఫీసులు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ ఏర్పాటు చేయోచ్చని సూచనలు చేసింది. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌తో పాటు 3 ఎడ్యుకేషన్‌ హెచ్‌ఓడీ ఆఫీసులు, నాలుగు అగ్రికల్చర్‌ హెచ్‌ఓడీ, సంక్షేమ–స్థానిక సంస్థలకు 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు ప్రతిపాదించింది. అటు కర్నూలులో హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థల ఏర్పాటు చేయోచ్చని సూచించింది.

అటు ప్రతిపక్షాలు, అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ముందుకే వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఎక్కడా న్యాయపరమైన చిక్కులు రాకుండా.. గతంలో హైదరాబాద్ నుండి అమరావతికి కార్యాలయాలు తరలించే సమయంలో అనుసరించిన విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నారు.

Tags

Next Story