మహారాష్ట్రలో మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు

మహారాష్ట్రలో మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు

maha

మహారాష్ట్రలో మంత్రి పదవులు, శాఖల కేటాయింపు వ్యవహారం మిత్రపక్షాల మధ్య కొత్త చిచ్చు పెడుతోంది. ఓవైపు మంత్రి పదవులు రాక అసమ్మతి రాగం అందుకున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మల్లగుల్లాలు పడుతున్న సీఎం ఉద్ధవ్ థాకరేకి.. ఇప్పుడు శాఖల కేటాయింపు కత్తిమీద సాములా తయారైంది. తమకు అంతగా ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించారంటూ కాంగ్రెస్ నేతలు కస్సుమంటు న్నారు. కొంతమంది నాయకులు పార్టీ అధిష్టానంతో మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్లారు. మరికొందరు తమకు కేటాయించిన శాఖలను స్వీకరించడానికి ఇష్టపడడం లేదు. రెవెన్యూ శాఖ పొందిన బాలాసాహెబ్ థోరట్ తప్ప మిగతా కాంగ్రెస్ మంత్రులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతల్లో విజయ్ వడెట్టివర్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గట్టి మద్దతు ఇచ్చిన ఆయన మంత్రివర్గ విస్తరణ తర్వాత పత్తాలేకుండా పోయారు. వడెట్టివర్‌కు ఓబీసీ మంత్రిత్వ శాఖ, ఉప్పు కయ్యల అభివృద్ధి, భూకంప బాధితుల పునరావాస శాఖలను కేటాయించారు. దీనిపై వడెట్టివర్ మద్ధతు దారులు మండిపడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల్లో మరొకరు అమిత్ దేశ్‌ముఖ్. ఆయనకు మెడికల్ విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన అమిత్.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేని కలిసి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు.

మరో మిత్రపక్షం ఎన్సీపీలో కూడా శాఖల కేటాయింపుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. తనకు ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల భద్రత శాఖను ఇవ్వడంపై ఛగన్ భుజ్‌బల్ మండిపడుతు న్నారు. పార్టీలో తనకంటే జూనియర్ అయిన జితేంద్ర అవద్‌కు హౌసింగ్ శాఖ ఇవ్వడమేంటని ఛగన్ భుజ్‌బల్ నిలదీస్తున్నారు.

Tags

Next Story