నిర్భయకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి

సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటం ఫలించింది. బాధిత కుటుంబం అంతులేని ఆవేదనకు ముగింపు పడే సమయం వచ్చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. ఈనెల 22న నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేయనున్నారు. జనవరి ఉదయం 7 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ వచ్చేసింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది.
నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ కావడంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు.
మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఢిల్లీ కోర్టు తీర్పును స్వాగతించాయి. ఏడేళ్ల పోరాటం ఫలించిందని, న్యాయస్థానాలపై ప్రజలకున్న నమ్మకం రెట్టింపైందని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు.
రాజకీయ, సినీ, పారిశ్రామికవర్గాలు కూడా నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ కావడంపై హర్షం వ్యక్తం చేశాయి. చట్టపరమైన మార్గంలోనే దోషులకు ఉరిశిక్ష అమలవుతోందని పేర్కొన్నాయి.
నిర్భయ దోషులు మాత్రం తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. క్యూరేటివ్ పిటిషన్ వేస్తామని, ఢిల్లీ కోర్టు తీర్పుపై స్టే కోరతామని వెల్లడించారు. ఆ నలుగురు దోషులు ఇప్పటికే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులపై రేపో మాపో ఆదేశాలు రానున్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com