నిర్భయ దోషులకు ఉరిశిక్ష.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముగ్గురు దోషులు

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి 22 న నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని పటియాలా కోర్టు ఆదేశించింది.
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష పడనుంది. ఇందుకోసం తీహార్ జైలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తీహార్ జైలులో ఒకటే ఉరికంబం ఉండగా నలుగురిని ఒకేసారి ఉరితీయడం కోసం మరో మూడు ఉరికంబాలను రెడీ చేశారు. ఉరి తర్వాత మృతదేహాలను తరలించడానికి సొరంగాలను కూడా నిర్మించారు. ఉరి సమయంలో జేసీబీ అవసరం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అందువల్ల జేసీబీని కూడా తీహార్ జైలుకు తీసుకొచ్చారు. అలాగే, బక్సర్ జైలు నుంచి ఉరి తాళ్లను కూడా తెప్పించారు.
ఇక, ముగ్గురు దోషులు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు. క్షమాభిక్ష దరఖాస్తులపై త్వరలో రాష్ట్రపతి ఆదేశాలు రానున్నాయి. క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ కోర్టు ఆదేశాల నేపథ్యంలో దోషులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవడానికి వారికి అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి.
2012 డిసెంబరు 16న ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2012 డిసెంబర్ 20న కన్నుమూసింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వినయ్ శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఒక బాలుడిని అరెస్టు చేశారు. ఆ ఆరుగురిలో ఐదుగురికి మరణశిక్ష పడింది. మరో వ్యక్తి మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్షతో బయటపడ్డాడు. రామ్ సింగ్ అనే దోషి జైల్లోనే ఉరేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురికి వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు చేసే అవకాశముంది.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com