జేఎన్‌యూ విద్యార్థులపై దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్న విపక్షాలు

ఢిల్లీ జేఎన్‌యూలో హింసకు కారణం వీసీ జగదీశ్ కుమారేనని వర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఆయన గూండాలా ప్రవర్తిస్తూ విద్యార్థులను హింసకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, కశ్మీర్ తదితర ప్రాంతాల్లోనూ విద్యార్థులు ఆందోళన చేశారు. SFI, AISA, PDSU తదితర విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. JNU హింసాకాండకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ కూడా.. వీసీ జగదీశ్ కుమార్ తొలగింపునకు డిమాండ్ చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాసింది
జేఎన్‌యూ హింసాకాండపై అయిషీ ఘోష్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అస్థిర పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు తన కుమార్తెను కొట్టారని.. రేపు తనపై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ పేర్కొన్నారు.
అటు జేఎన్‌యూ విద్యార్థులకు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ-బీఎస్పీ తదితర పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులపై దాడి ఘటన వెన్నులో వణుకు పుట్టించిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. మోదీ సహాయంతోనే గూండాలు విద్యార్థులపై దాడి చేశారని ఆరోపించారు. JNU ప్రొఫెసర్లు, విద్యార్థులపై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని మాయావతి సూచించారు. JNU హింసపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జేఎన్‌యూలో దాడులకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని తెలిపారు. కేసు దర్యాప్తును క్రైమ్‌బ్రాంచ్‌కు బదిలీ చేసినట్టు వివరించారు. ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు తెలపాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేశారు. మరోవైపు.. దాడుల్లో గాయపడి ఎయిమ్స్‌లో చికిత్స పొందిన 36 మంది విద్యార్థులు, అధ్యాపకులను ఇళ్లకు పంపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జేఎన్‌యూ మేనేజ్‌మెంట్ కూడా చర్యలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టి నెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో మాట్లాడారు. వర్సిటీలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జేఎన్‌యూ ఉన్నతాధికారులు ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌ను కలిసి తాజా పరిణామాలను నివేదించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com