రాజధాని మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి : చంద్రబాబు

రాజధాని మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి : చంద్రబాబు

babu

రాజధాని మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి డిమాండ్‌ చేశారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. రాజధాని గురించి రాష్ట్ర ప్రజలు కన్న కలలను ప్రభుత్వం భగ్నం చేసిందని మండిపడ్డారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రపంచస్థాయి కేపిటల్‌ సిటీ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజధానికి విజయవాడ అనువైన ప్రాంతం అని అన్ని కమిటీలు చెప్పాయని.. రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించి.. రాజధాని నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.

రాజధానిని మార్చాలన్న వైసీపీ ఆలోచనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకున్నారని విమర్శించారు. కమిటీల మీద కమిటీలు వేస్తూ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మారితే రాజధాని మారుస్తారా అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని... బయటకు వస్తే కేసులు పెడతారన్న భయంతోనే ముందుకు రావడం లేదని చంద్రబాబు అన్నారు. రైతులు ఆవేదనతో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలను పరామర్శించే బాధ్యత కూడా ముఖ్యమంత్రికి లేదా అని చంద్రబాబు నిలదీశారు.

రైతులు శాంతియుతంగా చేస్తున్న నిరసనలపైనా చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్య యుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ప్రజలందరూ తిరగబడితే ప్రభుత్వ దమనకాండ సాగదని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story