చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో బెంజ్‌ సర్కిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో బెంజ్‌ సర్కిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

babu-arrest-3

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దగ్గర హైడ్రామా నెలకొంది. అక్కడ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయం ప్రారంభం తర్వాత అక్కడి నుంచే.. బస్సు యాత్ర మొదలవ్వాల్సి ఉంది. అయితే.. పోలీసులు ఎంటరవడం అఖిలపక్ష నాయకుల ఆగ్రహానికి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. యాత్రకు బయల్దేరాల్సిన బస్సుల్లో కొన్నిటిని మందడం గ్రామానికి, మరికొన్నిటిని గురునానక్‌ కాలనీకి పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు.. గురునానక్ కాలనీకి పాదయాత్రగా బయల్దేరారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నేతలు అడుగులేశారు. పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. బస్సులకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని జేఏసీ నేతలు చెప్పారు. ఏ రూల్‌ కింద ఇలా వ్యవహరిస్తున్నారో చెప్పాలని పోలీసులను చంద్రబాబు నిలదీశారు. ఈ దమనకాండ ఏమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. బెంజ్‌ సర్కిల్‌లో నడిరోడ్డుపైనే ఆయన బైఠాయించారు. నిరసన తెలియజేశారు. చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో.. చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.

జేఏసీ బస్సుయాత్రను పోలీసులు అడ్డుకోవడం, చంద్రబాబు నాయుడు రోడ్డుపై బైఠాయించడం.. ఆయన్ని పోలీసులు అరెస్టు చేయడంతో బెంజ్‌ సర్కిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడలోని ఇతర ప్రాంతాల నుంచి అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, కార్యకర్తలు బెంజ్ సర్కిల్‌ వైపు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అంతకంతకూ జనహోరు పెరిగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లంతా నినాదాలు చేశారు. అడ్డుకున్న బస్సులను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో 5 జిల్లాల్లో బస్సుయాత్రకు సన్నాహాలు చేసింది జేఏసీ. ఈ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. రాజధాని మార్పుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన బస్సు యాత్రను భగ్నం చేసేందుకు అధికార యంత్రాంగం అడుగడుగునా ప్రయత్నించింది. బస్సుయాత్రలో పాల్గొనేందుకు తుళ్లూరు నుంచి వెళ్తున్న రాజధాని గ్రామాల మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు బయల్దేరిన బస్సులను సీజ్‌ చేశారు. మహిళలను మందడం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో.. వారు భగ్గుమన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసు అధికారులను నిలదీశారు. మేం ఏం తప్పు చేశామని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారని ప్రశ్నించారు. డీఎస్పీ ఆఫీస్‌ ఎదుట బైఠాయించి.. రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story