కుప్పకూలిన విమానం.. 176 మంది సజీవదహనం

కుప్పకూలిన విమానం.. 176 మంది సజీవదహనం

iran-plane-crash

ఇరాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టెహ్రాన్‌లో ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 176 మంది మృతి చెందారు. విమానంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రమాదంలో అందరూ చనిపోయారని ఇరాన్ అధికారవర్గాలు కూడా ధ్రువీకరించాయి. విమానం కూలిపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం, టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమైనీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫైంది. గాల్లోకి లేచిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విమానం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ మంటల్లో చిక్కుకొని విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 167 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు.

ప్రమాదానికి గురైన విమానం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని బోరిస్పల్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఉదయం 6.12 గంటలకు బోయింగ్ విమానం టేకాఫైంది. 8 నిమిషాల అనంతరం అది రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం గాల్లో ఉండగానే నిప్పంటుకుంది. విమానం ఓ బంతిలా మండుతూ కూలిపోయింది. నేలను ఢీకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాంతో ప్రయాణికులకు వేగంగా బయటపడే మార్గాలు మూసుకుపోయాయి. ప్రమాదం తాలూకు వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయి. విమాన శకలాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది.

విమాన ప్రమాదంపై ఇరాన్, ఉక్రెయిన్ స్పందించాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం, మంటలు ఎక్కువగా ఉండడంతో ఎవరినీ కాపాడలేకపోయాని ఇరాన్ అధికారులు తెలిపారు. ప్రమాదస్థలిలో 22 అంబులెన్సులు, 4 బస్ అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐతే, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటలకే విమాన ప్రమాదం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థే ప్రమాదవ శాత్తూ కూల్చి ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. విమాన ప్రమాదం వెనక అమెరికా హస్తముందని అనుమానం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story