వామ్మో.. ఇదేం మనిషి.. 15 ఏళ్లుగా పౌడర్ తిని బతికేస్తోంది..

వామ్మో.. ఇదేం మనిషి.. 15 ఏళ్లుగా పౌడర్ తిని బతికేస్తోంది..

lisa-anderson

ప్రపంచంలో పలు రకాల వింతలు.. వింత మనుషులు.. వింత అలవాట్లు.. రోజూ అన్నం తినాలంటే బోర్ అని ఓ రోజు చపాతీ.. మరో రోజు మరొకటి.. మొత్తానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటాం. లేకపోతే ఆత్మారాముడు గోల పెడతాడు.. జ్వరం వచ్చినప్పుడు అన్నం తినకపోతేనే ఏన్నో రోజులు తిండి మానేసినట్లు మొహం అంతా పీక్కుపోతుంది. శరీరం అంతా నీరసపడిపోతుంది.

మరి అలాంటిది 15 ఏళ్లుగా అన్నం కంటే పిల్లలకు రాసే జాన్సన్ పౌడరే కమ్మగా ఉందని డబ్బాలు, డబ్బాలు ఖాళీ చేస్తోంది. సుద్ద ముక్కలు, బలపాలు, చాక్ పీసులు తినే వాళ్లని చూశాము.. మట్టి కూడా తినే మహానుభావులూ ఉన్నారు. తిండి తింటేనే అరిగి చావట్లేదు.. మరి ఇలాంటివి తిని ఎలా అరిగించుకుంటున్నారో.. ఏం పిచ్చో ఏంటో.. 44 ఏళ్ల లిసా అండర్సన్ 2004లో పిల్లలకు పౌడర్ రాస్తూ ఆ వాసనకి ప్లాటై పోయింది.

ఆహా! వాసనే ఇంత బావుంది రుచి ఎలా ఉందో చూద్దామని నోట్లో వేసుకుంది. ఎందుకో చాలా బావున్నట్లనిపించింది ఆమెకు. తను చేసే వంట కంటే.. బయట తినే పిజా, బర్గర్లకంటే కూడా బావున్నట్లనిపించింది. అంతే .. రోజూ కొంత పౌడర్ తినడం మొదలు పెట్టింది. ఆఖరికి అన్నం మానేసి పౌడరే తింటూ కడుపు నింపుకునే స్టేజ్‌కి వచ్చేసింది. అలా పౌడర్ తినడం వల్ల మోషన్స్ అవుతున్నా అలవాటు మానుకోలేకపోతోంది.

ఐదుగురు పిల్లలు పుట్టినా పౌడర్ తినడం మానలేదు. పిల్లలకి పాల డబ్బాల ఖర్చుకంటే తన పౌడర్ డబ్బాల ఖర్చే ఎక్కువ అవుతోంది. ఈ 15 ఏళ్లలో పౌడర్ డబ్బాల కోసం రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టిందట. అర్ధరాత్రి నిద్రలో నడిచే అలవాటున్నట్లు ఈమెకు పౌడర్ తినే అలవాటు కూడా ఉంది. తన వీక్‌నెస్ తనని ఇబ్బందికి గురి చేస్తోందని ఇన్నేళ్లకు గుర్తించినట్టుంది.

వైద్యులను ఆశ్రయిస్తే ఆమెకి ఉన్న PICA అనే సిండ్రోమ్ కారణంగా పౌడర్ తింటోందని చెప్పారు. ఈ వ్యాధి కారణంగా తినడానికి ఉపయోగపడని పదార్థాలను రుచి చూడాలనే ఆలోచన కలుగుతుందని వివరించారు. లిసా పౌడర్ తినే అలవాటుని మాన్పించడానికి మందులతో పాటు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లేకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Read MoreRead Less
Next Story